కాంగ్రెస్ పార్టీలో చేరుతూనే రేవంత్ రెడ్డి తనకున్న బలమేంటో నిరూపించుకుంటున్నాడు. తెలంగాణలోని కొత్త జిల్లాల్లో ఏడుగురు జిల్లా స్థాయి అధ్యక్షులతో ఇప్పటికే రాజీనామా చేయించగా, మరో ఆరు జిల్లాల అధ్యక్షులు కూడా నేడో రేపో రాజీనామాకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరికొంతమందికి టీఆర్ఎస్ నుంచి ఆహ్వానాలు అందగా, భవిష్యత్తులో ఏమో తెలియదు గానీ, ప్రస్తుతానికి అయితే వారంతా తాము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతామని చెప్తున్నట్లుగా టాక్.
ఇక టీడీపీకి రాజీనామా చేసిన పార్టీల జిల్లా అధ్యక్షుల్లో సుభాష్‌రెడ్డి (కామారెడ్డి), బోడ జనార్దన్ (మంచిర్యాల), తోటకూర జంగయ్య యాదవ్ (మేడ్చల్), కేతావత్ బిల్యా నాయక్ (నల్లగొండ), పటేల్ రమేష్ రెడ్డి (సూర్యాపేట), సీహెచ్ విజయ రమణరావు (పెద్దపల్లి), సోయం బాపూరావు (ఆదిలాబాద్)లు ఉన్నారు. వీరితో పాటు వరంగల్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్యలు ఇప్పటికే రేవంత్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు.
నిజామాబాద్ జిల్లా నుంచి రాజారాం యాదవ్, ఖలీంపతి, నీలకంఠరావు పాటిల్, నారాయణ, జనార్దన్ రెడ్డి, పరవయ్య, ధనంజయ, ఏనుగు మోహన్ రెడ్డి, రేఖ, విజయలక్ష్మి, ఖమ్మం జిల్లా నుంచి కంభంపాటి చంద్రశేఖర్‌రావు, ప్రసాద్, బానోతు హరిప్రియ, బానోతు హరిసింగ్ నాయక్, దేవేందర్ నాయక్, ప్లెంట్ రోజ్, నల్గొండ జిల్లా నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. చివరి నిముషంలో వరంగల్ జిల్లా మహిళా నేత సీతక్క కూడా టిడిపికి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు.


