తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి హటాత్తుగా ‘తెలుగు సెంటిమెంట్’ గుర్తొచ్చింది. నిన్న హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “గతంలో పీవీ నరసింహ రావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన నంద్యాల లోక్ సభ నుంచి ఎన్నికలో పోటీ చేశారు. తెలుగువారైన పీవీని మనమే గెలిపించుకోవాలని ఎన్టీఆర్ ఆయనపై ఎవరినీ పోటీ పెట్టకుండా సహకరించారు.
ఎన్టీఆర్ స్పూర్తితో ఇప్పుడు ఏపీ, తెలంగాణలో అన్ని పార్టీలు మన తెలుగువారైన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలి. మన తెలుగు వాడికి ఈ అవకాశం లభించడం మనందరి అదృష్టం. కనుక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించాలని ఏపీ సిఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌లకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
నిజమే!మన తెలుగువాడికి ఇటువంటి అత్యున్నతమైన పదవి లభిస్తుందంటే చాలా సంతోషమే. కానీ ఇండియా కూటమీ చాలా తెలివిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని అభ్యర్ధిగా ఎంపిక చేసినంత మాత్రాన దాని ప్రత్యర్ధులు బుట్టలో పడతారనుకోవడం అత్యాశే అవుతుంది.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ‘తెలుగు సెంటిమెంట్’ సహేతుకంగానే ఉంది. కానీ నీళ్ళ విషయంలో ఈ ‘తెలుగు సెంటిమెంట్’ పట్టించుకోరు.
ఏపీ కూడా తెలుగు రాష్ట్రమే. ఏపీలో రాయలసీమ జిల్లాలలో లక్షలాది మంది (తెలుగు) ప్రజలు తాగు సాగు నీటి కోసం దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారు.
కనుక వారికి సముద్రంలో వృధాగా కలిసిపోతున్న గోదావరి వరద నీటిని బనకచర్ల ప్రాజెక్టు ద్వారా అందించాలని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అనుకుంటే, రేవంత్ రెడ్డి నిర్మొహమాటంగా కుదరదని చెప్పేశారు. తమకు తమ రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ఖరాఖండీగా చెప్పారు. పైగా బనకచర్ల ప్రాజెక్టుని అడ్డుకుంటామని స్పష్టంగా చెప్పేశారు.
కృష్ణా, గోదావరి నీళ్ళ పంపకాలలో, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ‘తెలుగు సెంటిమెంట్’ని గౌరవించనప్పుడు, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఎందుకు ఆయన మాట మన్నించాలి?
ఏపీతో నిత్యం నీళ్ళ కోసం పేచీలు పెట్టుకుంటూ, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ మళ్ళీ తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఎలా ఆడగగలుగుతున్నారు? అయినా ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ, జనసేనలు ఇండియా కూటమి అభ్యర్ధికి ఓట్లు వేయాలని రేవంత్ రెడ్డి ఎలా ఆశిస్తున్నారు? ఇది అత్యాశ కాదా?






