బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు.
అయితే గతంలో ఇదే మాదిరి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న అనేకమంది నేతలు కేంద్రం పై పోరాటం, ఢిల్లీ తో యుద్ధం, బీజేపీ తో సమరం, మోడీ – షాలతో తాడో పేడో అన్నట్టుగా చేసిన రాజకీయం చివరికి వారి పార్టీని అధికారానికి దూరం చేసింది అలాగే వారిని ప్రజలలో పలచన చేసింది.
ఇందుకు మొదటిగా చెప్పుకోవాల్సింది, బీజేపీ భాషలో చెప్పాలంటే మొదటి బీజేపీ బాధిత ముఖ్యమంత్రి…ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. 2014 ఎన్నికలలో టీడీపీ తో కలిసి అధికారాన్ని అందుకున్న బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వంలోనూ భాగమయ్యింది.
2014 ఎన్నికల హామీలో భాగంగా నాటి ప్రధాని మోడీ తిరుపతి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించారు, ఆ తరువాత ఆ హామీని ప్యాకేజ్ రూపంలోకి మార్చి ఆంధ్రుల ఆత్మగౌరవం మీద కొట్టారు. దీనితో ప్రజల అభీష్టం మేరకు ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందే అంటూ గళం విప్పిన నాటి ముఖ్యమంత్రి బాబు 2019 లో ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది.
ఇక ఇదే మాదిరి 2023 ఎన్నికలకు ముందు కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పుతా, ప్రాంతీయ పార్టీ నుంచి తెరాస ను జాతీయ పార్టీగా ప్రకటిస్తున్నా, ప్రధాని మోడీకి నేనే ప్రత్యామ్నాయ నాయకుడిని అంటూ నానా హంగామా చేసిన బిఆర్ఎస్ అధినేత, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ చివరికి ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ ప్రజలకు సైతం ముఖం చూపించలేని పరిస్థితిలో పడ్డారు.
ఇదే బాటలో ఆవేశంగా వెళ్లి బొక్కబోర్లా పడిన మరో ముఖ్యమంత్రి, హస్తినలో హ్యాట్రిక్ విజయం అందుకోవాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ని కట్టడి చెయ్యాలని ఉర్రుతలూగిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్. లిక్కర్ స్కాం లో కవిత తో పాటుగా అరెస్టయ్యి జైలుకెల్లొచ్చిన కేజ్రీవాల్ తన నిర్దోషిత్వాన్ని ప్రజా కోర్టులోనే తేల్చుకుంటా అంటూ బీజేపీ పెద్దల మీద సవాల్ చేసి మరి ఢిల్లీ ఎన్నికలలో పోటీ చేసారు.
దాని ఫలితం చివరికి ఆప్ తో పాటు కేజ్రీవాల్ సైతం ఓటమిని మూటకట్టుకున్నారు. ఇలా ఈ మూడు సందర్భాలలోనూ బీజేపీ ని ఎదిరించి మోడీ – షాలను ధిక్కరించిన ముఖ్యమంత్రులు తమ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేసుకోవడంతో పాటుగా కేసులను నెత్తినేసుకున్నారు, అవినీతి మరకలు అంటించుకుని జైలుకెళ్ళొచ్చారు.
ఇక్కడ బిఆర్ఎస్ విషయంలో పార్టీ అధినేత కు బదులు అధినేత కుమార్తె కవిత ఆ అరెస్టుల భారాన్ని మోస్తూ, జైలు జీవితాన్ని అనుభవించారు. అయితే ఇప్పుడు కాళేశ్వరం రూపంలో ఈ జైలు జీవితం కేసీఆర్ ను నీడలా వెంటాడుతుంది. ఇక ఇప్పుడు వీరిబాటలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం బీజేపీ పై విరుచుకుపడుతున్నారు, మోడీ, షాల పై బస్తీమే సవాల్ అంటూ రెచ్చిపోతున్నారు.
అంటే రానున్న భవిష్యత్ కాలంలో రేవంత్ రెడ్డి కూడా బాబు, కేసీఆర్, కేజ్రీవాల్ మాదిరి నిందలు మోయాల్సిందేనా.? కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ, బిఆర్ఎస్, ఆప్ లెక్క ప్రతిపక్షానికి పరిమితం అవ్వాల్సిందేనా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.






