ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుని తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవహించిన గోదావరి నీళ్ళు సముద్రంలో కలుస్తుంటాయి. ఆ నీటిని వాడుకుని బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్ళు అందించాలని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు భావించి ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్రానికి పంపారు.
కానీ తెలంగాణలో రెండు పార్టీల ఒత్తిళ్ళ వల్లనైతేనేమి, ఆ రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కావచ్చు ఆ ఫైలుని కేంద్ర ప్రభుత్వం ఏపీకి తిప్పి పంపించేసింది.
రేపు (బుధవారం) ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముఖాముఖీ సమావేశమయ్యి ఈ సమస్యపై చర్చించుకొని పరిష్కారం కనుగొనవచ్చు. కానీ బనకచర్ల ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రికి ఓ లేఖ పంపింది.
బనకచర్ల ప్రాజెక్టు వలన తెలంగాణకు నష్టం కలుగుతుందని వాదిస్తున్నప్పుడు ముఖ్యమంత్రుల సమావేశంలో దీనిపై తప్పనిసరిగా చర్చించాలని పట్టుబట్టి ఉండాలి కదా? కానీ దీనిని అజెండాలో చేర్చవద్దని, దీనిపై చర్చ పెట్టవద్దని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అంటే తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టు పేరుతో రాజకీయ మైలేజ్ పొందాలనుకుంటున్నాయి తప్ప వాటి వాదనలలో నిజం లేదని స్పష్టమవుతుంది. కనుక ఏపీ ప్రభుత్వమే చొరవ తీసుకొని కేంద్రంని ఒప్పించి బనకచర్ల ప్రాజెక్టుని ముందుకు తీసుకు వెళ్ళవలసి ఉంటుంది.




