విశాఖలో మళ్ళీ కోత… ప్రభుత్వం మారినా పరిస్థితి మారదా?

RK Beach erosion raises questions on Vizag development

జగన్‌ ప్రభుత్వం 5 ఏళ్ళు సంక్షేమ పధకాలు, వాటి కోసం అప్పులు, వైసీపీ రంగులు, పేర్లు, రాజకీయ కక్ష సాధింపులతోనే గడిపేసింది. విశాఖ రాజధాని చేస్తామంటూ ఊదర గొట్టేసిందే తప్ప కొత్తగా ఒక్క రోడ్, ఫ్లై ఓవర్ నిర్మించలేదు.

కనీసం విశాఖపట్నంకి ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఆర్‌కే బీచ్ కోతకు గురవుతుంటే పట్టించుకోలేదు. జగన్‌కి సంక్షేమ పధకాలు, రాజకీయ కక్షలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప మరొకటి పట్టదు గనుక ప్రజలు కోతకు గురవుతున్న ఆర్‌కే బీచ్‌ని, పిండవుతున్న రుషికొండని చూసి విశాఖ ప్రజలు బాధ పడుతుండేవారు.

ADVERTISEMENT

ఇప్పుడు అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. విశాఖ అభివృద్ధికి జోరుగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కనుక విశాఖ నగరం దశ మారిపోతుందని విశాఖ వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్పుడే ఏడాది గడిచిపోయింది. ఎక్కడ వేసిన గొంగళి ఇంకా అక్కడే ఉంది.

మెట్రో, భోగాపురం కబుర్లు తప్ప కొత్తగా ఒక్క పని మొదలవలేదు. సరే… ఏ ప్రభుత్వానికైనా పనులు మొదలు పెట్టడానికి కొంత సమయం పడుతుంది. కనుక విశాఖ అభివృద్ధి పనుల కోసం ప్రజలు ఓపికగా మరికొంత కాలం ఎదురు చూడక తప్పదు… అని సరిపెట్టుకుంటారు.

కానీ ఈ ఏడాది కూడా ఆర్‌కే బీచ్ కోతకు గురయింది. అవుతుందని ముందే తెలిసి ఉన్నా ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు!

బీచ్‌లో ‘సీ పెరల్’ వద్ద వాహనాల పార్కింగ్ చేసే చోట సముద్రం కోతకు గురవడంతో గోడ కూలిపోయింది. దాంతో ఆ మేరకు సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. సుమారు 20-30 అడుగుల పొడవునా రోడ్ కూడా కోతకు గురవడంతో చాలా ప్రమాదకరంగా మారింది.

కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి, రాష్ట్రంలో పర్యాటక ఆకర్షణ కేంద్రాలను అభివృద్ధి చేస్తామని చెప్పింది. కనుక ఆర్‌కే బీచ్ కోత సమస్యకు శాశ్విత పరిష్కారం చేస్తుందని ఆశించడం అత్యాశ కాబోదు. కానీ ఇంత చిన్న పని కూడా చేయలేకపోవడంపై విశాఖ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ నగరాన్ని పర్యవేక్షించడానికి జీవీఎంసీ, వుడా, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు అనేక మంది ఉన్నారు. కానీ సముద్రం కోతకు గురయ్యే వరకు పట్టించుకునే నాధుడే లేడు!

జగన్‌ హయంలో కూడా సముద్రం కోతకు గురైన తర్వాత ఆ ప్రాంతాలలో లారీలాలో బండరాళ్ళు, మట్టి తెచ్చి పోసి చేతులు దులుపుకునేది. కూటమి ప్రభుత్వం కూడా సముద్రం కోతకు గురైన తర్వాతే మేల్కొంటుందా?ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం చేయలేదా?అని విశాఖ ప్రజలు ప్రశ్నించకుండా ఉంటారా?

ADVERTISEMENT
Latest Stories