టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అమితంగా ద్వేషించేవారిలో మంత్రి రోజా కూడా ఒకరు. ఆయన అరెస్ట్ కాగానే స్వీట్లు పంచి టపాసులు కాల్చి సంబరాలు చేసుకొన్నారు. ఆరోజు నుంచి మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి చాలా అనుచితంగా మాట్లాడుతూనే ఉన్నారు. నారా లోకేష్‌తో సహా టిడిపి ముఖ్యనేతలందరినీ కూడా అరెస్ట్ చేయిస్తామని చెప్పారు.
నిన్న బాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి, జగన్‌పై నిప్పులు చెరిగి, త్వరలో తాను ప్రజల మద్యకు వస్తానని ప్రకటించారు. దీనిపై మంత్రి రోజా స్పందిస్తూ ‘బాలకృష్ణ ఓ మెంటల్‌గాడు’ అంటూ ఆయనపై కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది.
ఆమె మీడియాతో మాట్లాడుతూ “బాలకృష్ణ ఓ మెంటల్‌గాడు.. అని నేను అనడం లేదు. ఆయన ప్రెస్‌మీట్ చూసి ప్రజలే అనుకొంటున్నారు. ఆయన ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తాను ఓ మెంటల్ పేషంట్‌నని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. అలాంటి మెంటల్ పేషంట్ ఇప్పుడు టిడిపిని కాపాడేందుకు వస్తున్నారంటే ఆ పార్టీ పని అయిపోయిన్నట్లే.
చంద్రబాబు నాయుడు తర్వాత తన అల్లుడు నారా లోకేష్ జైలుకి వెళ్ళబోతున్నారని తెలియగానే బాలకృష్ణ హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు.
ఆయన తెలుగు వారిని కాపాడటం కోసం పోరాదుతానని చెప్పుకొన్నారు కానీ ఆయన పోరాటం బావ చంద్రబాబు నాయుడు కోసమే. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఆయన ప్రజల కోసం పోరాటాలు చేశారా?కనీసం తన హిందూపురం నియోజకవర్గం సమస్యల పరిష్కారానికైనా పోరాడారా? ఏనాడైన శాసనసభకు వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడారా?
ఇలాంటి బాధ్యత లేని మానసికరోగి ఇప్పుడు ప్రజల కోసం పోరాడేందుకు వస్తున్నారట! ఇలాంటి మానసిక రోగి టిడిపిని నడిపిస్తే ఆ పార్టీ పని అయిపోయిన్నట్లే.. అంటూ మంత్రి రోజా, ఆనాడు ఎన్టీఆర్‌ను చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ కలిసి వెన్నుపోటు పొడిచారని తీవ్ర పదజాలంతో విమర్శించారు.
బాలకృష్ణతో కలిసి రోజా సినిమాలలో నటిస్తున్నప్పుడు, ఆమెకు బాలకృష్ణలో ఏ లోపాలు కనిపించలేదు. గతంలో టిడిపిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడులో ఆమెకు ఏ లోపాలు కనిపించలేదు. కానీ వైసీపిలో చేరాకనే కనిపిస్తున్నాయంటే అర్దం ఏమిటి?



