రెండు నెలల క్రితం కల్వకుంట్ల కవిత ‘బీజేపిలో బీఆర్ఎస్ పార్టీ విలీనం’ అంటూ ఓ పెద్ద బాంబు పేల్చారు. తర్వాత ఏపీ బీజేపి ఎంపీ సిఎం రమేష్ కూడా ఆమె మాటలను ధృవీకరిస్తూ ఆ పని మీద కేటీఆర్ తనని కలిశారంటూ మరికొన్ని కొత్త విషయాలు చెప్పారు.
ఒకవేళ నిజం కాదనుకుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న కేటీఆర్ వాటిని గట్టిగా ఖండించి ఉండాలి. కానీ లేదు. ఆ తర్వాత హటాత్తుగా కొన్ని వారాలు అంతా నిశబ్ధం పాటించారు. ఇప్పుడు హటాత్తుగా కేసీఆర్ వీర విధేయుడు, బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బలమైన కారణం ఏదీ లేకుండానే పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి నేతలు కూడా రాజీనామా చేసినట్లు సమాచారం.
గువ్వల బాలరాజు నేరుగా ఈ నెల 11న బీజేపి గూటిలో చేరబోతున్నారు. అంటే తెలంగాణలో బీజేపి గుట్టుగా ‘ఆకర్ష’ పని మీదనే ఉందన్న మాట!
సాధారణ పరిస్థితిలోనైతే గువ్వల పార్టీని వీడి బీజేపిలో చేరడం సర్వసాధారణంగానే అనిపించేది. కానీ బీజేపిలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అని కల్వకుంట్ల కవిత చెప్పిన నేపధ్యంలో చూసినట్లయితే, విలీనం బదులు కేసీఆర్ నమ్మకస్తులను ఒకరొకరిగా బీజేపిలోకి సాగనంపబోతున్నారేమో? అనే సందేహం కలుగుతుంది. ఈ అనుమానం నిజమా కాదా?” అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
ఏది ఏమైనప్పటికీ కేసీఆర్‌కు వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్న గువ్వల బాలరాజు నేరుగా బీజేపి గూటికి వెళ్ళడంతో బీఆర్ఎస్ పార్టీలోపల ఏం జరుగుతోంది? అనే అనుమానాలు కలుగుకమానవు. ఆయన బీజేపిలో చేరిన ‘లోయల్టీ టెస్ట్’లో పాస్ అయ్యేందుకు కేసీఆర్, కేటీఆర్‌ల మీద విమర్శలు గుప్పించడం ఖాయం. కనుక గువ్వల నోరు విప్పితే ఫామ్‌హౌసు రహస్యాలు మరెన్ని బయటపడతాయో?






