‘టీవీ 9’ ఛానల్ ను ఇప్పటికీ 100 సార్లు అమ్మేసారు!

TV9 CEO Ravi Prakashతొలి తెలుగు న్యూస్ ఛానల్ గా మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన టీవీ 9 ఛానల్, ఇప్పటికీ మీడియా రంగంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. న్యూస్ ప్రజెంటేషన్ లో స్పష్టత, ఖచ్చితమైన సమాచారానికి నిలయంగా ప్రేక్షకుల మదిలో ముద్ర వేసుకోవడంతో… ఎన్ని ఛానల్స్ వచ్చినా, టీవీ 9 స్థానం చిరస్థాయిగా ఉండిపోయింది. అయితే ఇటీవల కాలంలో ఈ ఛానల్ అమ్మకంపై ఒక ప్రచారం జరిగింది.

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన సన్నిహితులు కొందరు టీవీ 9ను భారీ ధరకు కొనుగోలు చేసారని, దీంతో టీవీ 9 కూడా కేసీఆర్ అమ్ముల పొదిలో అస్త్రంగా మారనుందన్న ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. వెబ్ & సోషల్ మీడియాల ద్వారా జరిగిన ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, తాజాగా టీవీ 9 సీఈఓ రవిప్రకాష్ స్పష్టం చేసారు. ఒక ఆంగ్ల వెబ్ సైట్ కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు విషయాన్ని ధృవీకరించారు.

ADVERTISEMENT

మీడియా పుణ్యమా అంటూ టీవీ 9 ఛానల్ ను ఇప్పటికీ కొన్ని వందల సార్లు అమ్మేశారని సెటైర్ వేసిన రవి ప్రకాష్, ‘మై హోమ్’తో ఎలాంటి లావాదేవీలు లేవని అన్నారు. అలాగే నారా లోకేష్ తో కలిసి మరో కొత్త ఛానల్ కు శ్రీకారం చుట్టబోతున్నారని వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని, అసలు అలాంటి ఆలోచన కూడా లేదని స్పష్టం చేసారు. టీవీ 9 అనేది రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా ఉండే ఒక స్వతంత్ర సంస్థగా అభివర్ణించారు.

రవి ప్రకాష్ తాజా వ్యాఖ్యలతో పుకార్లకు శుభంకార్డు పడ్డట్లయ్యింది. అయితే ఇంతకు ముందు కొన్ని వెబ్ సైట్లు, పక్కా సమాచారం మాదిరి… టీవీ 9ను కొన్ని కోట్లకు అమ్మేశారని ఫిగర్లు వేసి మరీ చూపించారు. అంతేకాదు, ఈ డీల్ ఎలా జరిగింది..? దీని వెనుక ఎవరెవరూ ఉన్నారు..? అంటూ రాసిన కధనాలన్నీ ఒట్టి ‘కధ’లేనని తేలింది.

ADVERTISEMENT
Latest Stories