నిన్న ఖండించి…నేడు దృవీకరించి

 sajjala rama krishna reddy about congress alliance రాజకీయ పార్టీలు సొంత డప్పు కొట్టుకోవడానికి, తమ ప్రత్యర్ధులపై ఎదురుదాడి చేయడానికి బలమైన సొంత మీడియా కలిగి ఉండటం చాలా అవసరంగా మారిందిపుడు. కనుక సదరు పార్టీని, దాని మీడియాను వేరు చేసి చూడలేము. మరోవిదంగా చెప్పాలంటే ఆ మీడియా సదరు పార్టీకి రాజకీయ మిత్రపక్షమని చెప్పుకోవచ్చు.

ఇంతకీ విషయం ఏమిటంటే, మొన్న దాదాపు అన్ని న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్లలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్‌ అధిష్టానంతో సమావేశమవడం, వచ్చే ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తుల గురించి సలహాలు ఇవ్వడం గురించి ప్రధానంగా వార్తలు వచ్చాయి. వాటిలో ఆయన ఏపీలో వైసీపీతో కాంగ్రెస్‌ పొత్తులు పెట్టుకోవాలని సూచించినట్లు కూడా ఉంది.

ADVERTISEMENT

దానిపై వెంటనే వైసీపీ ఆత్మసాక్షి రంగంలో దిగిపోయి ఎదురుదాడి ప్రారంభించేసింది. తెలుగు దేశానికి కొమ్ము కాస్తున్న ఆ మీడియా ఇటువంటి పుకార్లు వ్యాప్తి చేస్తూ వైసీపీ శ్రేణులో, ఏపీ ప్రజలలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందంటూ తేల్చి చెప్పేసింది.

కానీ ఈరోజు సాక్షి ఎడిషన్‌లో అందుకు పూర్తి భిన్నంగా ‘సోనియా చేతికి నివేదిక’ పేరుతో ఓ వార్తను ప్రచురించింది. దానిలో ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్‌ అధిష్టానంతో సమావేశమయ్యి పలు సూచనలు చేశారని, 2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏవిదంగా ముందుకు సాగాలో చెపుతూ ఓ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ కూడా ఇచ్చారని పేర్కొంది. ఆయన సూచనలపై కాంగ్రెస్‌ కమిటీ ఓ నివేదిక తయారుచేసి సోనియా గాంధీకి సమర్పించిందని సాక్షి పేర్కొంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తను కూడా దానిలో పేర్కొంది.

ఏపీ ప్రజలలో, పార్టీ శ్రేణులలో గందరగోళం సృష్టించడానికే ఇటువంటి వార్తలను తమ ప్రత్యర్ధి మీడియా వండి వారుస్తోందంటూ నిన్న హడావుడిగా ఖండించి, నేడు అవే వార్తలను నిజమని దృవీకరిస్తే ఇప్పుడు ఏపీ ప్రజలు, పార్టీ శ్రేణులు అయోమయానికి గురికారా?మీడియా కూడా ఓ రాజకీయ పార్టీలాగ మారిపోయి అధికార పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తుండటం వలననే ఈవిదంగా జరుగుతోందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories