చంద్రబాబు స్కిల్ స్కాం చేసారంటూ ప్రజలను నమ్మించడానికి గడిచిన నెల రోజులనుండి మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అవినీతిపరుడు మీరు నమ్మాలి అంటూ ప్రచారం చేసే వైసీపీ నేతల అసలు వ్యూహం ఏమిటో నేడు సజ్జల గారు వివరించారు. ఈ వివరణతో అసలు చంద్రబాబు స్కాం చేశారా లేక వైసీపీ ప్రభుత్వమే స్కాం లో చంద్రబాబుని ఇరికించారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
బాబు అవినీతి చేసారంటూ పదే పదే చెప్పి ప్రజల మైండ్ లోకి ఎక్కించడానికి మేము చాల తిప్పలుపడాల్సి వస్తుంది అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల సెలవిచ్చారు.ఇప్పుడు ఈ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తన సామజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తూ బాబుని దోషిగా చిత్రీకరించడానికి వైసీపీ నేతల కష్టాలు ఇవిగో అంటూ ఆ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.
అసలు నిజంగా అవినీతే జరిగి ఉంటే ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు అవినీతిపరుడు అంటూ బలవంతంగా ప్రజల మనస్సులోకి చేరేలా ఇలా తిప్పలు పడాల్సిన అవసరం ఏముందో? అంటే బాబు పై వైసీపీ ప్రభుత్వం చేసే ఆరోపణలను ప్రజలు విశ్వసించడం లేదని సజ్జల భావిస్తున్నారా? అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేశారా? అంటూ తెలుగు తమ్ముళ్లు తమకు దొరికిందే సందన్నట్లు రెచ్చిపోతున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏమో ఆధారాలతో బాబు అడ్డంగా బుక్కైయ్యారు అంటారు, దొరికిన దొంగ బాబు అంటూ విమర్శలు చేస్తుంటారు. న్యాయస్థానాలలో అధికారులేమో ఆధారాలు సమర్పించడానికి విచారణ జరగాలి, కొంత సమయం కావాలి అంటూ విచారణను వాయిదాలతో కాలయాపన చేస్తున్నారు. ఇందులో ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపాలి? ఎవరిని నమ్మాలి? ఎవరిని నిందించాలి?
ప్రభుత్వం చెపుతున్నట్లు ఆధారాలు ఉంటే సమర్పించడానికి అధికారులకు సమయం ఎందుకు? ప్రభుత్వం తన దగ్గర ఉన్న ఆధారాలను అధికారులకు అందచేస్తే ఆ ఆధారాలతో వైసీపీ కోరుకున్నట్లే బాబు చేసిన నేరానికి తగిన శిక్షను న్యాయస్థానాలు ఖరారు చేస్తాయి కదా! అప్పుడు ఇలా రోజు మీడియా ముందుకు వచ్చి బాబు అవినీతిపరుడు అంటూ చెప్పుకోవాల్సిన దుస్థితి ఉండదు కదా? ఇలా అన్ని అంతుచిక్కని ప్రశ్నలే మిగిలాయి.
వైసీపీ నేతలు ప్రతిపక్ష నేతల పై ఒకే ఆరోపణను పదే పదే చెప్పి ప్రజలను నమ్మించడానికి చూస్తున్నారు కానీ ఆ ఆరోపణలో వాస్తవం లేదని సజ్జల ఒప్పుకున్నట్లేనా? చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీ పార్టీని తన హస్తగతం చేసుకున్నారని, బాబు అవినీతిపరుడు ప్రజల సొమ్ముని దోచేశాడు, పవన్ ఒక ప్యాకేజీ స్టార్,బాబుకి దత్తపుత్రుడు అంటూ వైసీపీ నేతల విమర్శలు కూడా ఇదే కోవకి వస్తాయన్నమాట!
టీడీపీ – జనసేన రెండు పార్టీల అధినేతల మీద వైసీపీ నేతల రిపీటెడ్ విమర్శలు ఇవే. ఐతే ఒక అబద్దాన్ని నిజం చేయడానికి ఈ రిపీటెడ్ ఫార్ములాను వైసీపీ పార్టీ అవలంబిస్తుందని ఇకనైనా ఏపీ ప్రజలు నమ్మినట్లైతే ఏపీలో మళ్ళి వైసీపీ ప్రభుత్వం రిపీట్ అవకాశమే ఉండదు అంటున్నారు తెలుగుదేశం – జనసేన పార్టీల నేతలు.కుక్కను కోతి అంటూ కొంతకాలం కొందరిని మాత్రమే మభ్యపెట్టగలరు అది అన్నివేళలా అందరిని మభ్య పెట్టడం కుదరదు అనేది వైసీపీ నేతలు సజ్జలకు సలహా ఇస్తే బాగుంతుందంటూ టీడీపీ వర్గాలు వైసీపీ నేతలకు సలహాలిస్తున్నారు.




