జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల ఏపీ రాజకీయాలలోకి వస్తుండటంతో ‘వైఎస్ బ్రాండ్ ఇమేజ్’ దెబ్బతినకుండా ఆమెను ఏవిదంగా ఎదుర్కోవాలా… అని వైసీపి పండితులు మేధోమధనం చేసిన తర్వాత ఆమెను చంద్రబాబు నాయుడుకి ట్యాగ్ చేయడం ద్వారా డ్యామేజ్ తగ్గించుకోవచ్చని నిర్ణయించి అదే ముక్క సజ్జల రామకృష్ణా రెడ్డి నోటితో నిన్న చెప్పించేసారు.
జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ని తెచ్చుకున్నారని, అయినా ఎన్నికలలో గెలవలేమని గ్రహించి కుట్రలు చేసి వైఎస్ షర్మిలని ఏపీ రాజకీయాలలోకి రప్పిస్తున్నారని సజ్జల చెప్పేసారు.
అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు ఆమెపై నేరుగా విమర్శలు చేయకుండా, ఆమెను చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి ఆయనను విమర్శించాలని ఒక లైన్ ఇచ్చారనుకోవచ్చు. కానీ ఈ వాదన వైసీపి నేతల ఊక దంపుడు ఉపన్యాసాల నిడివి పెంచడానికి పనికి వస్తుంది కానీ దీంతో వైఎస్ షర్మిలని కట్టడి చేయలేమని వైసీపి పండితులకు కూడా తెలుసు.
అయితే ఈ సమస్యకు మరో తరుణోపాయం కనుగొనే వరకు కొంత సమయం పడుతుంది కనుక అంత వరకు ఈ లైన్‌తో వైసీపి నేతలు కాలక్షేపం చేసుకోమని సజ్జల సూచించిన్నట్లే భావించవచ్చు. వైఎస్ షర్మిలకు వెల్ కమ్ చెప్పేందుకు వైసీపి సిద్దమైంది కనుక ఇక ఆమెదే ఆలస్యం. వస్తే… ఆడుదాం ఆంద్రా (పొలిటికల్) గేమ్స్ మొదలుపెట్టేసుకోవచ్చు.




