సినీ భోగీ మంటల్లో అందరూ తలో పిడకా…

Sankranti cinema controversy involving Jana Nayagan and Raja Saab films

ఈసారి సినీ పరిశ్రమలో భోగీ మంటలు కాస్త ముందే రాజుకున్నాయి. సంక్రాంతి బరిలో దిగిన రెండు పెద్ద సినిమాలలో జన నాయకుడుకి సెన్సార్ బ్రేకులు వేసి నిలిపేసింది. రాజాసాబ్ టికెట్ ఛార్జీలు రివ్యూల వివాదంలో చిక్కుకొని బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ రెండు సినిమాలపై చర్చ జరుగుతుండగానే రాంగోపాల్ వర్మ అసలు సెన్సార్ బోర్డు అవసరమా?అంటూ భోగీ మంటలు రాజేశారు.

ADVERTISEMENT

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ, “నేను టికెట్ రేట్లు పెంచమనలేదు. దాని కోసం ఎవరూ నా దగ్గరకు రాలేదు. నేను ఏ ఫైల్ మీద సంతకం పెట్టలేదు. నేను సినీ పరిశ్రమని పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను,” అంటూ ఆ మంటల్లో మరో రెండు పిడకలు వేశారు. సంబందిత మంత్రిగా ఆయన కాకపోతే ఎవరు అనుమతించాలి? అంటే సిఎం రేవంత్ రెడ్డే అని తేల్చి చెప్పేశారు.

రాజసాబ్ టికెట్ ఛార్జీల పెంపుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు వేసిన మొట్టికాయల బొప్పి ఇంకా తగ్గనే లేదు. సినీ పరిశ్రమతో సంబంధం లేదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటలపై చర్చ జస్ట్ ఇప్పుడే మొదలైంది.

ఈలోగా తెలంగాణ ప్రభుత్వం మన శంకర్ వరప్రసాద్ గారికి టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు జీవో జారీ చేసింది. రాజాసాబ్‌కు అరకొర పెంచి అదీ… అర్దరాత్రి దాటిన తర్వాత మెమో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, ప్రసాద్ గారికి మాత్రం రెండు రోజుల ముందే భారీగా పెంచుకునేందుకు అనుమతించింది.

కనుక భోగీ మంటలలో మళ్ళీ తెలంగాణ పిడకలు పడకమానవు. ఏది ఏమైనప్పటికీ ఈసారి సంక్రాంతికి చలి చాలా ఎక్కువగా ఉంది కనుక ఇలాంటి భోగీ మంటలు అందరినీ వెచ్చగా ఉంచుతాయి.

ADVERTISEMENT
Latest Stories