మరికొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం “సర్దార్ గబ్బర్ సింగ్” పైరసీ సీడీలు కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రత్యక్షం అయ్యాయన్న వార్తలు హల్చల్ చేస్తుండటంతో పోలీసులు ఒక్కసారిగా దాడులు చేశారు. చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసిన కొందరు టెక్నీషియన్లు రెండు రోజుల క్రితం చిత్రాన్ని కాపీ చేసుకున్నారని, వీటిని మార్కెట్లోకి పంపారని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందడంతో పట్టణంలోని అన్ని సీడీ షాపులు, తయారీదారులపై పోలీసులు దాడులు చేశారు.
సీడీలను బల్క్ గా తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే దుకాణాలపైనా దాడులు చేసి అక్కడి కంప్యూటర్లు హార్డ్ డిస్క్ తదితరాలను పరిశీలించారు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారని తెలుస్తోంది. అయితే, తమ దాడుల్లో ఈ చిత్రం పైరసీ సీడీలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ఈ వార్తలతో మెగా అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. “అత్తారింటికి దారేది” సినిమాకు ఇలాగే సినిమా విడుదలకు ముందే సినిమా పైరసీ బాట పట్టి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే.



