నేడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి. కనుక ఈ పేరుతో రాజకీయ నాయకులు చేసే హడావుడి మాత్రమే ఎక్కువగా హైలైట్ అవుతుంది తప్ప ‘భారత రత్న’ పటేల్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఎవరూ చెప్పే ప్రయత్నం చేయరు.
కానీ పటేల్ గురించి పూర్తిగా చెప్పుకోవాలంటే పెద్ద పుస్తకమే వ్రాయాల్సి ఉంటుంది. కనుక ఆయన గురించి చాలా మందికి తెలియని కొన్ని ముఖ్య విషయాలు మాత్రమే క్లుప్తంగా చెప్పుకుందాం.
· ఆయన పేరు మోసిన క్రిమినల్, డిఫెన్స్ లాయర్. స్వాతంత్ర్య సమరయోధుడు. కరాచీ కాంగ్రెస్ అధ్యక్షుడు. హోమ్ మంత్రి, ఉప ప్రధాని.
· ఆనాడు న్యాయశాస్త్రంలో డిగ్రీ చేయడం కోసం లండన్ వెళ్ళిన వారిలో పటేల్ సోదరులిద్దరూ ఉన్నారు. వారిలో పటేల్ ఖర్చులు తగ్గించుకోవడం కోసం వీలైనంత త్వరగా చదువు పూర్తి చేయాలనుకున్నారు. కనుక 36 నెలల కోర్సుని 30 నెలలోనే పూర్తి చేయడమే కాక ‘ఫస్ట్ క్లాస్’లో పరీక్షలు పాసయ్యారు. ఇందుకుగాను 50 పౌండ్లు బహుమానం కూడా పొందారు.
· 1900 సం.లో పటేల్ కుటుంబంతో సహా గుజరాత్‌లోని గోద్రాకు తరలివెళ్ళి అక్కడ న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు, అక్కడ ప్లేగూ వ్యాధి వ్యాపించి అనేక వేల మంది చనిపోయారు. అప్పుడు ఆయనకు కూడా ఆ వ్యాధి సోకింది. కుటుంబాన్ని వేరే ప్రాంతానికి పంపించేసి ఆయన ఒక్కరే అక్కడే ఓ ఆలయంలో (ఐసోలేషన్) ఉంటూ యోగా, ఆహార నియమాలు పాటిస్తూ, సొంతంగా వైద్యం చేసుకొని నయం చేసుకున్నారు.
· 1908, జనవరి 11న ఆయన బోర్సాద్ కోర్టులో ఓ క్రిమినల్ కేసు వాదిస్తున్నారు. ఆ సమయంలో భార్య చనిపోయిందని టెలిగ్రాం చేతికి అందింది. కానీ పటేల్ కేసుని మద్యలో వదిలేయలేదు. టెలిగ్రాం జేబులో పెట్టుకొని తన వాదనలు పూర్తి చేసి ఆ కేసుని గెలిపించాక బొంబాయి చేరుకొని భార్య అంత్యక్రియలు పూర్తి చేశారు.
· పటేల్ భారత రాజ్యాంగ రచనలో కూడా పాల్గొన్నారు. రాజ్యాంగంలో ప్రాధమిక హక్కులకు సంబంధించి సెక్షన్స్ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకోసం ఏర్పాటు చేసిన ‘ప్రాధమిక హక్కుల కమిటీ’కి ఆయనే చైర్మన్.
· కశ్మీర్ విషయంలో వివాదం ఏర్పడినప్పుడు నాటి ప్రధాని నెహ్రూ ఈ సమస్యని ఐక్యరాజ్య సమితిలో పెట్టబోతే హోమ్ మంత్రిగా ఉన్న పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈరోజుల్లో ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రి, కనీసం ఓ ఎమ్మెల్యే మాటని ఎవరైనా కాదనగల సాహసం ఎవరైనా చేయగలరా? కానీ నాడే పటేల్ ఈ సాహసం చేశారు.
· స్వాతంత్రం తర్వాత కూడా భారత్‌లో విలీనమయ్యేందుకు ఇష్టపడని హైదరాబాద్, జునాఘడ్, తదితర సంస్థలను సైనికచర్యతో విలీనం చేశారు.
· 1950, డిసెంబర్ 15న పటేల్ బొంబాయిలో కన్ను మూశారు.
· అయన మరణించిన నాలుగు దశాబ్దాల తర్వాత అంటే 1991లో భారత్ ప్రభుత్వం ఆయనకు ‘భారత రత్న’ ప్రకటించింది.
· 2018, అక్టోబర్ 31న గుజరాత్‌లో నర్మదా నది తీరంలో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరిట కేంద్ర ప్రభుత్వం ఆయన విగ్రహం ఏర్పాటు చేసింది. ప్రపంచంలోకెల్లా ఎత్తైన విగ్రహం (182 మీటర్లు) ఇదే. నేడు అక్కడే సర్దార్ పటేల్ జయంతి ఉత్సవాలలో ప్రధాని మోడీ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటున్నారు.







