క్లుప్తంగా శశికళ జీవితం ఇది!

Sasikala Natarajan Politics‘కాలం కలిసి వస్తే బళ్లు ఓడలు, కాలం కలిసి రాకపోతే ఓడలు బళ్లు అవుతాయన్న’ నానుడి తమిళనాడు అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ శశికళా నటరాజన్ పట్ల నిజమైంది. సాధారణ వీడియో షాపు ఓనర్ గా జీవితాన్ని సాధారణంగా నడిపిన శశికళ… వ్యక్తిగత సహాయకురాలిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంలోకి ప్రవేశించడంతో ఊహించని మార్పులు చవిచూసింది. జయలలితకు పెద్దగా ధనాపేక్షలేదు. సినీ జీవితం ఉచ్ఛస్థితిలో ఉండగానే ఆమె రాజకీయాల్లో ప్రవేశించారు. దీంతో ఆమెకు డబ్బుకు ఏనాడూ లోటు లేదు.

శశికళకు అలా కాదు, డబ్బుకోసం తీవ్ర ప్రయత్నాలు, స్థితిమంతురాలిగా మారాలన్న కోరికతో జయలలిత వెన్నంటి ఉన్నారు. అదే సమయంలో జయలలితకు కొంత ఓదార్పు అవసరమైంది. దీన్ని అవకాశంగా మలచుకున్న శశికళ వ్యక్తిగత సహాయకురాలి స్థాయి నుంచి నమ్మకస్తురాలిగా, సన్నిహితురాలిగా, ఆప్తమిత్రురాలిగా మారారు. ఇదంతా జయలలిత గొప్పదనమే. ప్రత్యర్థుల పన్నాగాలు పసిగట్టేందుకు శశికళకు జయలలిత పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. దీన్ని అవకాశంగా మలచుకున్న శశికళ కుటుంబం జయలలితకు దగ్గరైంది. ఏకంగా పొయెస్ గార్డెన్ కు మకాం మార్చింది. మేనల్లుడ్ని దత్తపుత్రుడ్ని చేసింది.

ADVERTISEMENT

దీంతో ఇక అంతా తమదే అని భావించిన మన్నార్ గుడి మాఫియా, ఆమె అధికారాన్ని అండగా చేసుకుని అక్రమాలకు తెరతీసింది. దీనిని పసిగట్టిన జయలలిత మొత్తం కుటుంబాన్ని పొయెస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టారు. ఇది తట్టుకోలేకపోయిన శశికళ మరో కుట్రకు తెరతీశారని, జయలలితపై విషప్రయోగం కూడా జరుగుతోందంటూ వార్తలు వెలువడ్డాయి. దీంతో శశికళను కూడా జయలలిత పొయెస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టారు. నాలుగు నెలల తరువాత భర్త, కుటుంబాన్ని వదిలేశానంటూ శశికళ మళ్లీ జయలలిత చెంతకు చేరారు. దీంతో ఆమెను జయలలిత అక్కున చేర్చుకున్నారు.

ఇంతలో అధికారం కోల్పోవడం, అక్రమాస్తుల కేసులు చుట్టుముట్టడం, జైలుకు వెళ్లడం, బెయిల్ పై బయటికి రావడం, ఎన్నికల్లో విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. అనంతరం జయలలితను అనారోగ్యం చుట్టుముట్టడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. దీంతో మళ్ళీ శశికళ వైభవం ప్రారంభమైంది. అంతవరకు జయలలిత అడుగులకు మడుగులొత్తిన వారంతా శశికళ అడుగులకు మడుగులొత్తడం ప్రారంభించారు. జయలలితకు నమస్కరించినట్టే శశికళకు కూడా నమస్కరించడం ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా శశికళ జీవితం మారిపోయింది.

చుట్టూ చిన్నమ్మ అంటూ అరుపులు, భారీ భద్రత, అడుగు వేస్తే సేవలు ప్రారంభమయ్యాయి. గతంలో జయలలితకు ఆమె చేసిన సేవలన్నీ ఇప్పుడు వేరేవాళ్లు ఆమెకు చేయడం ప్రారంభించారు. దీంతో శశికళలో అధికార దర్పం పెరిగింది. దీంతోనే ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిని తానేనంటూ ప్రకటించి కలకలం రేపారు. అయితే జయలలితతో అక్రమాస్తుల కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న శశికళకు శిక్ష పడింది. దీంతో రాజకీయాధికారం ఆశలు అడియాసలయ్యాయి. ఒక్కసారిగా తనకు జైకొట్టిన కార్యకర్తలు దూరమయ్యారు.

జైలు శిక్షతో ప్రభుత్వం సెక్యూరిటీని ఉపసంహరించుకుంది. భవిష్యత్ ముఖ్యమంత్రి అంటూ భజన చేసిన ఎమ్మెల్యేలు కూడా భవిష్యత్ సీఎం అంటూ పళనిసామి చుట్టూ తిరుగుతున్నారు. దీంతో శశికళ దగ్గర ఎవరూ లేక… చివరి దశలో ఒంటరిగా మిగిలిపోయారు. ఏ కుటుంబం కోసం ఆమె ఇంత చేయాల్సి వచ్చిందో ఆ కుటుంబం కూడా ఇప్పుడు అండగా నిలుస్తుందో? లేక చేయిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఓడలు బళ్లు, బళ్లు ఓడలు కావడమంటే ఇదే!

ADVERTISEMENT
Latest Stories