తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షతన దూసుకుపోయిన బీజేపీ, శాసనసభ ఎన్నికలలో గెలిచే అవకాశాన్ని ఆ పార్టీ అధిష్టానం చేజేతులా పాడు చేసుకొందనే విషయం అందరికీ తెలిసిందే. బీజేపీ అధిష్టానం బహుశః కేసీఆర్‌కి తోడ్పడేందుకు కూర్చొన్న కొమ్మని నరుక్కోగా, బిఆర్ఎస్‌కి బదులు తెలంగాణలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ లాభపడటం విశేషం.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడంతో ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారింది. ఒకప్పుడు ఈ రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీలు కొట్లాడుకునేవి. ఇప్పుడు బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కొట్లాడుకొనే పరిస్థితి నెలకొంది.
అయితే దీనిని రాష్ట్ర బీజేపీ మరో అవకాశంగా భావిస్తోంది. ఏవిదంగా అంటే… ఇదే అదునుగా రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ తీసి బలహీన పరచగలిగితే, అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే ఉంటుంది.
అయితే మరో పక్క బిఆర్ఎస్‌లో కూడా ఇదే అంశంపై మేధోమధనం జరుగుతోంది. ఓ పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మరోపక్క కేంద్రంలో మోడీ ప్రభుత్వం… రెంటినీ ఢీకొని పోరాడటం చాలా కష్టం. కనుక లోక్‌సభ ఎన్నికలలోగా బీజేపీతో దోస్తీ కలుపుకుంటే మంచిదని కేటీఆర్ తండ్రికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కానీ ఇంతకాలం మోడీని, బీజేపీని నానా తిట్లు తిట్టి ఇప్పుడు అదే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు మొహం మీద ఉమ్మేస్తారని, మజ్లీస్ పార్టీ తలక్ చెప్పేసి రేవంత్ రెడ్డితో దోస్తీకి ‘కుబూల్ హై’ అని చెప్పేస్తుందని కేసీఆర్ కొడుకుకి నచ్చజెపుతున్నట్లు తెలుస్తోంది.
బిఆర్ఎస్‌లో జరుగుతున్న ఈ అంతర్మధనం గురించి రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా తెలుసు. బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడే బలహీనంగా ఉంది కనుక ఎట్టి పరిస్థితులలో ఆ పార్టీతో పొత్తుకి అంగీకరించవద్దని, ఇదే అదునుగా బిఆర్ఎస్ పార్టీని సమూలంగా తుడిచిపెట్టేయవచ్చని, అప్పుడే రాష్ట్రంలో బీజేపీ మళ్ళీ పుంజుకోగలదని తెలంగాణ బీజేపీ నేతలు తమ అధిష్టానానికి నచ్చజెప్పుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కేసీఆర్‌ని ఎదుర్కోవడం కంటే తమలో తామే కీచులాడుకొనే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడమే బీజేపీకి సులువు. ఒకవేళ బీజేపీ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు (లోక్‌సభ ఎన్నికలు) కోసం కేసీఆర్‌తో దోస్తీ చేస్తే, బిఆర్ఎస్ మళ్ళీ బలపడుతుందని, అప్పుడు 2028 ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు పార్టీలని బీజేపీ ఎదుర్కోవలసి వస్తుందని, అంటే కేసీఆర్‌తో దోస్తీ వలన ఆయనే లాభపడతారు తప్ప బీజేపీ కాదని రాష్ట్ర బీజేపీ నేతలు తమ అధిష్టానానికి నచ్చచెపుతున్నారు.
కనుక బీజేపీ అధిష్టానం కేసీఆర్‌తో మళ్ళీ దోస్తీకి సిద్దపడుతుందా లేక బిఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ తీసి తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తుందా?అనే ప్రశ్నకు బహుశః త్వరలోనే సమాధానం లభించవచ్చు.




