ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాలలో వారాహితో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి జనసేనను గెలిపించాలని, ముఖ్యమంత్రిగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్ధిస్తున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇవ్వాలి తప్ప ముష్టి అడుక్కొంటే రాదు. అసలు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో ఎన్ని స్థానాలలో పోటీ చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారు. ఆయన నిజంగా ముఖ్యమంత్రి కావాలనుకొంటున్నారా? అయితే 175 స్థానాలలో జనసేన పోటీ చేస్తుందా? చేయకపోతే 30 సీట్లతో ముఖ్యమంత్రి కాగలరా?చెప్పాలి.
పవన్ కళ్యాణ్ పదేపదే చెప్పుల గురించి మాట్లాడుతున్నారు. చెప్పులు పోగొట్టుకొంటే కొత్తవి కొనుక్కోవచ్చు. కానీ జనసేన ఎన్నికల చిహ్నం పోతే మళ్ళీ సంపాదించుకోవడం కష్టం. తన ఎన్నికల చిహ్నం (గాజు గ్లాసు) పోయిందనే విషయం ఆయనకు గుర్తులేన్నట్లుంది. ముందు ఆ సంగతి చూసుకొంటే ఆ తర్వాత ఎన్నికలలో పోటీ చేయడం, ముఖ్యమంత్రి అవడం గురించి తాపీగా కలలు కనొచ్చు,” అని ఎద్దేవా చేశారు.
మరోమంత్రి దాడిశెట్టి రాజా స్పందిస్తూ, “పవన్ కళ్యాణ్ వారాహి వేసుకువచ్చి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన రెండు సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆయన సభలకు కనీసం 4,000 మంది కూడా రాలేదు. రాష్ట్రంలో ఇండిపెండెంట్లుగా చాలా మంది గెలిచారు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకొన్నా ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. అసలు ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియదు. ఆయన తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రచారం చేసుకొంటున్నారా లేక చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రచారం చేస్తున్నారా? ఏవిషయంలోనూ ఆయనకు క్లారిటీ లేదు,” అని ఎద్దేవా చేశారు.
ఇదివరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇంకా ఎందరో పాదయాత్రలు చేశారు. చేస్తున్నారు. తమ పార్టీకి ఒక అవకాశం ఇమ్మనమని ప్రజలను అడిగారు. అడుగుతున్నారు.
తమ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే ప్రజల వద్దకు వెళ్ళి ‘ఒక్క ఛాన్స్’ ఇమ్మని బ్రతిమాలిన సంగతి మరిచిపోయి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని ప్రజలను ముష్టి అడుక్కొంటున్నారని మంత్రి సీదిరి చాలా చులకనగా మాట్లాడారు.
ఇప్పటి వరకు “జనసేన ఒంటరిగా పోటీ చేయగలదా?ప పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్న వైసీపీ నేతలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్ ఇమ్మనమని, ప్రభుత్వం ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి అవుతానని చెపుతుంటే షాక్ అయిన్నట్లున్నారు.
బహుశః అందుకే అందరూ కూడబలుక్కొని వచ్చి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తావో చెప్పాలంటూ కొత్త రాగం ఆలపిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వారికి తెలియకుండా రహస్యంగా ఎన్నికలలో పోటీ చేసి ముఖ్యమంత్రి అయిపోలేరు కదా?
“నేను ఒంటరిగా పోటీ చేస్తానో లేదా ఉమ్మడిగా పోటీ చేస్తానో సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెపుతాను. ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఎన్ని వ్యూహాలైనా అమలుచేస్తాము,” అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు కదా?మరి తినబోతు గారెల రుచి ఎలా ఉందని అడగటం దేనికి?
అయినా ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడని, ఆయన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని ఎద్దేవా చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్‌ని చూసి ఇంతగా భయపడటం దేనికి?ఇతమంది మంత్రులు ఎందుకు పనిగట్టుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్లు?పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తున్న మంత్రులలో ఎక్కరైనా ఏనాడైనా మీడియా సమావేశంలో తమ శాఖలకు సంబందించి పనుల గురించి మాట్లాడిన్నట్లు గుర్తుందా?





