తనపై గుడ్లదాడికి పాల్పడిన వారిపై పెట్టిన కేసును ఉపసంహరించుకున్న మహేశ్ కత్తికి సినీ రచయిత కోన వెంకట్ ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో మహేశ్ కత్తి ఫొటో పోస్ట్ చేసి థ్యాంక్స్ చెప్పాడు. ‘‘వివాదానికి ఇంతటితో ముగింపు పలికేందుకు ముందుకొచ్చిన నీకు ధన్యవాదాలు. నీ కెరీర్ బాగుండాలి. ఇకపై నిన్ను ఎవరూ దూషించరు, నీ జోలికి ఎవరూ రారు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే వారు పవన్ కు శత్రువులు అవుతారు. నన్ను నమ్ము’’ అంటూ ట్వీట్ చేశాడు.
మహేశ్ కత్తితో ‘మహాన్యూస్’ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పవన్ అభిమానులు-మహేశ్ కత్తికి మధ్య సయోధ్య కుదిరింది. దీంతో స్టూడియో నుంచి నేరుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పవన్ అభిమానులపై పెట్టిన కేసును కత్తి ఉపసంహరించుకున్నారు. అనంతరం పవన్ అభిమానులు, మహేశ్ కత్తి కలిసి ఫిలింనగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో పార్టీ కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. కత్తి మాట్లాడుతూ తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం కానీ, కక్ష కానీ లేవని పేర్కొన్నాడు.
కాగా, పవన్ అభిమానులు-మహేశ్ కత్తి మధ్య సయోధ్య కుదిరినందుకు ఇటు టాలీవుడ్‌తో పాటు పవన్ అభిమానులు, సామాన్య ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివాదం ఇంతటితో ముగిసినట్టేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా టీవీలకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేక వీరి ఉదంతాన్నే హైలైట్ గా చూసి చూసి బోర్ కొట్టేసిందని చెప్పవచ్చు. ఫిలిం నగర్ లో నిన్న రాత్రి కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ పార్టీ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కత్తి మహేష్ తాజాగా మరో ట్వీట్ చేశారు. తన పోరాటమంతా నిర్భయంగా మన అభిప్రాయాలను వెల్లడించే హక్కును కాపాడుకోవడానికే అని ట్విట్టర్ లో తెలిపారు. ఆ హక్కును సరెండర్ చేస్తున్నట్టు తాను ఎక్కడా చెప్పలేదని చెప్పారు. తాను సైలెంట్ గా కూర్చోవాల్సిన అవసరం లేదని తెలిపారు. వ్యక్తులను టార్గెట్ చేయబోనని… అయితే విధానాలు, సమస్యలు, ఆలోచనల గురించి తన అభిప్రాయాలను మాత్రం ఎప్పటిలానే ముక్కుసూటిగా వెల్లడిస్తూనే ఉంటానని అన్నారు.



