గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి దారుణంగా హత్య చేయబడ్డారు. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఆ కేసులో నిందితుడుగా పేర్కొనబడుతున్న వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయింది. ఈ కేసులో సునీతారెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి న్యాయపోరాటాలు చేస్తున్నా ఆ కేసు మాత్రం కొలిక్కి రావడం లేదు. న్యాయస్థానాలు దోషులను గుర్తించి శిక్షించలేకపోతున్నాయి. దీనిని బట్టి నిందితులు ఎంత బలమైనవారో అర్దం చేసుకోవచ్చు.
ఈ నేపధ్యంలో మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “విశాఖ నగరరంలోని భూములను కబ్జాలు చేయడం మినహా నగరానికి ఏమి చేశారని ఇక్కడ సభ పెట్టారు జగన్మోహన్ రెడ్డి?
విశాఖ రాజధాని పేరు చెప్పి, ఋషికొండను బోడిగుండు చేసేసి దానిపై వందల కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. విశాఖ బీచ్ రోడ్డుని ఆనుకుని భీమిలి వరకు ఉన్న భూములన్నిటినీ మీ వైసీపి నేతలే కబ్జాలు చేసేశారు కదా? విశాఖ ప్రజలు మీకెందుకు ఓట్లు వేయాలి?” అని ప్రశ్నించారు.
“సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని పైకి పంపేశారు… నేనో లెక్కా?అందుకే నా ప్రాణాలు కాపాడుకోవడానికి నేను రివాల్వర్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకున్నాను. ‘రివాల్వర్ ఎందుకు… ఇద్దరు గన్‌మ్యాన్‌లను ఇస్తామని’ జిల్లా ఎస్పీ అన్నారు. కానీ జగన్ ప్రభుత్వం వారితోనే నా కదలికలపై, నా రాజకీయ కార్యక్రమాలపై నిఘా పెడుతుందని నాకు తెలుసు. అందుకే వద్దని చెప్పేశాను,” అని అయ్యన్నపాత్రుడు అన్నారు.
వైఎస్ షర్మిల గురించి మాట్లాడుతూ, “గత ఎన్నికలలో బాబాయ్ వివేకాని లేపేశారు. కనుక ఈసారి తమకు అడ్డువస్తోందని చెప్పి ఆమెను లేపేసేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు. ఆమె ప్రాణాలకు చాలా ప్రమాదం ఉందని భావిస్తున్నాను. కనుక వైఎస్ షర్మిలకు భద్రత పెంచాలి. ఆమె కూడా ఎల్లప్పుడూ తగు జాగ్రత్తలో ఉండటం మంచిది,” అని చింతకాయల అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.



