ప్రస్తుత రాజకీయ రణరంగంలో గెలుపు గుర్రాన్ని అధిరోహించాలి అంటే ఎంతటి విజనరీ నాయకుడికైనా, ఎన్ని దశాబ్దాలు రాజకీయ అనుభవం ఉన్న పార్టీలైన ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఉచిత పథకాలను ఆశ్రయించాల్సిందే అన్నట్టుగానే పరిస్థితులు మారిపోయాయి.
ఒకప్పుడు ఉచిత పథకాలకు ఆమడ దూరంలో ఉండే బీజేపీ నుంచి అభివృద్ధితో సంక్షేమం అన్న టీడీపీ వరకు ఇప్పుడు రాజకీయ ట్రెండ్ ను ఫాలో కాకా తప్పడం లేదు. అయితే గత ఐదేళ్లు రాష్ట్రంలో నవరత్నాలు అంటూ జగన్ చేసిన ఆర్థిక విధ్వంశం ఇప్పటికి రాష్ట్రాన్ని కోలుకోనివ్వడం లేదు.
బటన్లు నొక్కడం ద్వారా తన పార్టీకి ఓటు బ్యాంకును పెంచుకుంటున్న అనుకున్న జగన్ కు అసలు వాస్తవాలు తెలిసే లోపే వైసీపీ కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకవర్గం ఓట్ల కోసం సంక్షేమ బటన్లు నొక్కడానికి అలవాటు పడిపోయిన వైసీపీ ఇతర వర్గాల పై ఆర్థిక భారాన్ని వేస్తూ వచ్చింది.
కరెంట్ బిల్లు పెంపు నుంచి చెత్త పన్ను వసూలు వరకు, ఆస్తి పన్ను నుంచి ఉప్పు పప్పు వరకు అన్నింటి మీద గత వైసీపీ ప్రభుత్వం బాదుడే బాదుడు అనే విధంగా సామాన్య మధ్యతరగతి నడ్డి విరిచింది.
దీనితో అటు రాష్ట్రంలో అభివృద్ధి కనిపించక ఇటు ప్రభుత్వం వేసే ఆర్థిక భారాలను మోయలేక వైసీపీ అంతమే తమ పంతం అన్నట్టుగా ఎన్నికల కోసం ఆకలిగా ఉన్న పులి మాదిరి ఎదురు చూసినట్టు చూసారు సామాన్య మధ్య తరగతి ప్రజలు. దాని ఫలితమే వైసీపీ 151 నుంచి 11 కి పడింది.
అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం సైతం అధికారం అందిపుచ్చుకోవడం కోసం తలకు మించిన భారాన్ని మోయడానికి సిద్దపడి సూపర్ సిక్స్ అంటూ ముందుకెళ్తుంది. అయితే ఈ సూపర్ సిక్స్ అమలు మరొకరికి భారం కానంత వరకు కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో అసంతృప్తి వెలువడదు.
కానీ బాబు కూడా జగన్ మాదిరి కరెంట్ బిల్లులను, రేవంత్ సర్కార్ మాదిరి బస్ చార్జీలను పెంచుకుంటూ పొతే కూటమి పాలన పట్ల కూడా ప్రజలలో వ్యతిరేకత తప్పదు. అయితే కూటమి ప్రభుత్వం ఇటు అమరావతి నుంచి అటు పోలవరం వరకు ఇటు ఐటీ నుంచి అటు వ్యవసాయం వరకు అన్నిటిలో అభివృద్ధి ని కంటికి కనిపించేలా చేస్తుంది.






