మద్యం కుంభకోణం కేసుకి ముగింపు ఇదే!

SIT Names Jagan Mohan Reddy in AP Liquor Scam

మద్యం కుంభకోణం కేసులో జగన్‌ సూత్రధారి, అంతిమ లబ్దిదారు అని సిట్ తేల్చి చెప్పేసింది. దీని కోసం ఏసీబీ కోర్టులో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

మద్యం కుంభకోణం కేసు ఆలోచన మొదలు అమలు, లబ్ది వరకు ప్రతీ దశలో మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రమేయం చాలా స్పష్టంగా ఉందని తెలియజేసే అనేక సాక్ష్యాధారాలను ఏసీబీ కోర్టుకి సమర్పించింది.

ADVERTISEMENT

మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి సూత్రధారి, అంతిమ లబ్దిదారు అని ఇప్పటికే స్పష్టమైంది. కనుక అదే విషయం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడమే అవుతుంది. కనుక జగన్‌ అవినీతిని కోర్టులో నిరూపించినపుడే ఏసీబీ సామర్ధ్యం నిరూపితమవుతుంది. దాని శ్రమ ఫలిస్తుంది.

కానీ అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసులని విచారణ జరిపిన సీబీఐ, ఈడీలే నిరూపించలేకపోతున్నప్పుడు, ఏసీబీ నిరూపించగలదా?అంటే కాదనే అనిపిస్తుంది. ఈ కేసుకి సంబందించి మీడియాలో వస్తున్న వివరాలు సామాన్య ప్రజలు ఎవరికీ అర్ధం కావు. అంత సంక్లిష్టంగా ఉంది. కనుక ఈ సంక్లిష్టతలే జగన్‌కి అనుకూలంగా, ఏసీబీకి సవాలుగా నిలుస్తాయి.

ఏసీబీ సిబ్బంది ఈ కేసుకి సంబంధించి పత్రాలను ట్రంక్ పెట్టెలలో మోసుకువచ్చి కోర్టుకు సమర్పించారు. కనుక వాటిలో పేర్కొన్న ప్రతీ ఆరోపణపై కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. అవి కొలిక్కివస్తున్నట్లయితే, ఏవేవో పిటిషన్లు వేస్తూ విచారణ ముందుకు సాగకుండా నిలువరించడంలో జగన్‌కు అపారమైన అనుభవం ఉంది.

కనుక ఈ కేసు మీడియాకి, న్యాయస్థానాలకు, న్యాయవాదులకు అందరికీ పని కల్పించే వ్యవహారంగా మాత్రమే కావచ్చు.

కనుక ఏతావాతా ఏం జరుగుతుంది? అంటే ఈ కేసులో జగన్‌ని అరెస్ట్‌ చేసి ఓ మూడు లేదా ఆరు నెలలో జైలులో పెట్టగలరు.

కానీ జైల్లో ఎంత కాలం ఉంటే తనకు, వైసీపీకి ఎంత సానుభూతి లభిస్తుందనే దానిని బట్టి జగన్‌ ఎన్ని రోజులు జైల్లో ఉండాలో నిర్ణయించుకుని బెయిల్‌ తీసుకొని బయటకు వచ్చేస్తారు.

ఆ తర్వాత స్టోరీ అందరికీ తెలిసిందే. మిగిలిన కేసులతో పాటు ఈ కేసు పేరు కూడా ‘మమ’ అని చెప్పుకుంటే సరిపోతుంది.

కనుక ఈ కేసుతో అవినీతి సొమ్ము కక్కించడం అసాధ్యం. దోషులకు శిక్షలు విధించడం ఇంకా అసంభవం. మరైతే ఏం సాధించినట్లు? అంటే ఈ కేసుతో కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి రాజకీయంగా లాభనష్టాలు ఎంత?అనేదే ఈ కేసుకి ముగింపు అనుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories