ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ జరుపుతున్న సిట్ అధికారులు హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లోని భారతీ సిమెంట్స్ ప్రధాన కార్యాలయంలో తనికీలు చేసి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆఫీస్ కేంద్రంగా మద్యం ముడుపులు వివిధ మార్గాలకు మళ్ళించారని సిట్ అధికారులు కనుగొనడంతో సోదాలు నిర్వహించారు.
జగన్ సతీమణి భారతీ పేరిట నెలకొల్పిన ఈ కంపెనీలో 49 శాతం వాటా కలిగి ఉండగా మిగిలిన 51 శాతం ఫ్రాన్స్ దేశానికి చెందినా వికాట్ అనే కంపెనీ కలిగి ఉంది. కానీ నేటికీ భారతి సిమెంట్స్ జగన్ సతీమణి భారతి పేరునే కార్యకలాపాలు సాగిస్తోంది.
ఈ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప మద్యం కుంభకోణం ముడుపులను మళ్ళించేందుకు వీలుగా కాగితాల మీద నకిలీ కంపెనీలు సృష్టించి వాటి ద్వారా డబ్బుని నగదు లేదా బంగారం రూపంలో వెనక్కు వచ్చేలా ప్లాన్ చేశారని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. కనుక ఈ కేసులో ఆయనని అరెస్ట్ చేశారు.
ఇప్పుడు సిట్ అధికారులు భారతీ సిమెంట్స్ వరకు వచ్చేశారంటే తర్వాత జగన్ లేదా భారతికి నోటీసు ఇచ్చి విచారణకు రప్పించడం ఖాయంగానే కనిపిస్తోంది.
కానీ ఈ మద్యం కుంభకోణంని విజయసాయి రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కసిరెడ్డి తదితరులు ప్లాన్ చేస్తున్నప్పుడే, భవిష్యత్తులో ఎటువంటి సాక్ష్యాధారాలు దొరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
కనుక ఈ కేసు గురించి సిఎం చంద్రబాబు నాయుడు తొలిసారి మాట్లాడినప్పుడే లేదా పోలీసులు కేసు నమోదు చేసినప్పుడే, ఈ కేసుకు సంబంధించి పత్రాలు, హార్డ్ డిస్కులు వగైరా అన్నీ మాయం చేసే ఉంటారు.
కనుకనే ఈ కేసు ఓ అభూత కల్పనని వైసీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నట్లు భావించవచ్చు. కనుక సిట్ అధికారులు హైదరాబాద్ వెళ్ళి భారతీ సిమెంట్స్ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించారని వార్తలు వ్రాసుకోవడానికి పనికి వస్తుంది. లేదా నేడో రేపో జగన్ అరెస్ట్ ఖాయం అనే భావన వైసీపీ శ్రేణులకు, ప్రజలకు కల్పించగలరు.
కానీ సిట్ అధికారులు జగన్ వరకు చేరుకొని విచారణకు రప్పించగలిగితే అసలు కధ అప్పటి నుంచి మొదలవుతుంది. కానీ అదెప్పుడో?






