ఒకప్పుడు మనుషులు ఎవరి జీవితాలు వారు బ్రతికేవారు. కానీ అప్పుడూ వారిపై సమాజ ప్రభావం ఉండేది. కనుక సమాజానికి లోబడి కట్టుబాట్లను ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ జీవించాల్సి వచ్చేది.
ఇప్పుడు ఆ సమాజం ‘సోషల్ మీడియా’ అనే సరికొత్త రూపం ధరించి వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తోంది. కాదు కాదు… తారుమారు చేసేస్తోంది.
ఏ స్థాయిలో అంటే ఆస్పత్రిలో చేరిన సెలబ్రెటీలు తప్పనిసరిగా తాము ఇంకా బ్రతికే ఉన్నామని నిరూపించుకోవాలి. లేకుంటే వారు బ్రతికి ఉండగానే సోషల్ మీడియా శ్రద్దాంజలి ఘటించేస్తుంది. వ్యక్తులపై సోషల్ మీడియా… అదే సమజానికి అంత ప్రేమ… శ్రద్ధ, ఆసక్తి ఉన్నాయన్న మాట.
భారత మహిళా క్రికెటర్ స్మ్రుతి మంధాన, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ విషయంలో కూడా సోషల్ మీడియాలో ఇలాగే చొరవ తీసుకుంది. అతనికి వేరే అమ్మాయిల సంబంధం ఉన్నందున వారిద్దరికీ మనస్పర్ధలు వచ్చాయని, కనుక చివరి నిమిషంలో వారి పెళ్ళి రద్దు అయ్యిందని లోకానికి తెలియజేసింది.
కానీ వాస్తవం ఏమిటంటే, మొన్న మహారాష్ట్రలోని సంగ్లీలో వారి పెళ్ళికి ముందు ఆమె తండ్రికి గుండెపోటు వచ్చింది. దాంతో అందరూ ఆయనని ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. ఆయన ఆస్పత్రిలో ఉండగా తాము పెళ్ళి చేసుకోవడం సబబు కాదని స్మ్రుతి మంధాన, పలాష్ ముచ్చల్ భావించారు. ఇరు కుటుంబాల పెద్దలు కూడా అదే అనుకున్నారు.
కనుక వారి పెళ్ళి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వారు పెళ్ళి వాయిదా అని చెపితే రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియా వీరులు స్వీకరించి మిగిలిన కధ సొంతంగా అల్లేసి విడుదల చేశారు.
తమ గురించి వస్తున్న ఈ పుకార్లను చూసి వారు వెంటనే తాము కలిసే ఉన్నామని, త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నామని తెలియజేశారు. లేకుంటే ఈలోగా సోషల్ మీడియా పెళ్ళిపెద్ద బాధ్యత స్వీకరించి వారిద్దరికీ వేరే వారితో పెళ్ళిళ్ళు జరిపించేస్తుంది.
సోషల్ మీడియాకి నియంత్రణ, సరిహద్దులు లేకపోవడం వల్లనే ఇటువంటి మోడ్రన్ సమస్యలు పుట్టుకువస్తున్నాయి. ఆకలితో నకనకలాడిపోయే బకాసురుడు వంటి సోషల్ మీడియాకు ఎవరో ఒకరు రోజూ బకరా (మేక) కావాల్సిందే. కనుక నేడు స్మ్రుతి, ముచ్చల్ రేపు మరొకరు బలి కావాల్సిందే!






