అనేక ట్విస్ట్ లు… ఇంకెన్నో సందేహాలు… చిత్రవిచిత్రమైన మీడియా కధనాల నడుమ ‘అతిలోకసుందరి’ శ్రీదేవి పార్థీవదేహం ఇండియాకు చేరుకోబోతోంది. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరితే మళ్ళీ రీ పోస్ట్ మార్టం చేయాల్సి రావచ్చు గనుక, మరో రోజైనా సమయం పడుతుందేమోనని మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేసిన నేపధ్యంలో… వాటన్నింటిని పటాపంచలు చేస్తూ… శ్రీదేవి పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
ఎంబామింగ్ ప్రక్రియ ఓ రెండు గంటల సమయం పట్టనుంది, అలాగే దుబాయ్ నుండి ఇండియాకు రావాలంటే మరో మూడు గంటలు సమయం పట్టనుంది. అలాగే విమానాశ్రయం నుండి శ్రీదేవి ఇంటికి చేరుకోవడానికి మరో గంట నుండి రెండు గంటల సమయం పట్టనున్న నేపధ్యంలో… మొత్తంగా మంగళవారం నాడు రాత్రి సమయానికి గానీ, బుధవారం వేకువ జామునకు గానీ ‘అతిలోకసుందరి’ చివరిచూపుకు ముంబై వేదిక అవనుంది.
అభిమానులు మరియు సెలబ్రిటీల సందర్శనార్ధం బుధవారం నాడు పార్థీవ దేహాన్ని ముంబైలోని శ్రీదేవి ఇంటి వద్ద అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు అనిల్ కపూర్ ఇంట్లో ఉన్న శ్రీదేవి మొదటి తనయురాలు జాహ్నవిని పలకరించగా, చాలామంది సెలబ్రిటీలు బుధవారం నాడు ప్రత్యక్షం కానున్నారు. ఇక టాలీవుడ్ నుండి ఎవరెవరు వెళ్తారో వేచిచూడాలి. ఇప్పటికే వెంకటేష్ అయితే ముంబై చేరుకున్నారు.



