శ్రీదేవి భౌతికకాయం ముంబైలోని లోఖండ్ వాలా, గ్రీన్ ఏకర్స్ లోని ఆమె స్వగృహానికి చేరుకోవడంతో సినీ ప్రపంచం మొత్తం అక్కడికే చేరుకుంది. ఒకవైపు బంధువులు, సినీ ప్రముఖులు, వందలాది మంది నటీనటులు, వేలాది మంది అభిమానులు ఆమె నివాసానికి చేరుకుంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆమె నివాసం వద్దకు అభిమానులు పోటెత్తారు. దీంతో ఆమె నివాస ప్రాంగణం మొత్తం జనాలతో కిక్కిరిసిపోయిది.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కి చెందిన పలువురు నటీనటులు ఆమెను కడసారి చూసేందుకు తరలివచ్చారు. రజనీకాంత్, కమలహాసన్, వెంకటేష్, షారూఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీఖాన్, దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్, టబు, రేఖ, ఫరాఖాన్, జావేద్ అఖ్తర్, షబానా ఆజ్మీ, రాణిముఖర్జీ తదితర వందలాది మంది నటీనటులు ఆమె నివాసానికి చేరుకుంటున్నారు. శ్రీదేవి ఇంటి ప్రాంగణమంతా జనాలతో కిక్కిరిసింది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాసేపట్లో ఆమె పార్థివదేహాన్ని ఆమె నివాసం నుంచి సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ కు అభిమానుల సందర్శనార్థం తరలించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సందర్శనార్థం ఆమె పార్థివదేహం అక్కడ ఉంటుంది. ఆ తరువాత కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి విల్లేపార్లేలోని సేవా సమాజ్ శ్మశానవాటికకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.



