దుబాయ్ లో అర్ధాంతరంగా ముగిసిన శ్రీదేవి కేసులో బొక్కలు ఉన్నాయంటూ తెలుగు టాప్ మీడియా ఛానల్ టీవీ9 ప్రత్యేక కధనాలు ప్రసారం చేసింది. ‘70 గంటలు… 7 ప్రశ్నలు…’ అంటూ చేసిన ఈ కథనంలో… దుబాయ్ రాజు ఈ కేసులో కలుగజేసుకున్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. అలాగే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేసిన విచారణ కూడా సరిగా సాగలేదని పేర్కొంది.
అయితే శ్రీదేవి కేసు క్లోజ్ కావడం అనేది టీవీ9ను నిరుత్సాహ పరిచినట్లుగా ఉందంటూ టాలీవుడ్ టాప్ రచయిత కోన వెంకట్ ట్వీట్ చేశారు. ఆఖరికి దుబాయ్ కింగ్ పైన కూడా అభియోగాలు చేస్తున్నారు, ఒక మీడియా సంస్థగా అసలు మీకేం కావాలి? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గా ఎప్పుడు మారారు? మీకు మీరే బ్రేక్ ఇచ్చుకోండి… అంటూ సూచనలతో కూడిన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇటీవల కాలంలో టీవీ9 చేస్తోన్న ప్రసారాలు వరుసగా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనకారి అయ్యే వార్తలను పక్కనపెట్టి, తమ టీఆర్పీ కోసమే టీవీ9 ప్రసారాలు చేస్తోందని సోషల్ మీడియా వేదికగా గత కొంతకాలంగా నెటిజన్లు మండి పడుతున్నారు. శ్రీదేవి ఉదంతంతో కోన వెంకట్ వంటి ప్రముఖులు కూడా టీవీ9పై ఇదే రకమైన భావనను వ్యక్తపరచడంతో మరోసారి నెటిజన్ల విమర్శలకు గురవుతోంది.



