బుధవారం నాడు జరగనున్న అంతిమ యాత్ర కోసం శ్రీదేవి పార్థీవదేహం సిద్ధమవుతోంది. కడసారి చూపు కోసం పెద్ద ఎత్తున అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీదేవి ఇంటికి పయనం అవనున్నారు. పార్థీవదేహం తరలింపులో దుబాయ్ పోలీసుల చట్టం వలన అనేక పుకార్లు షికార్లు చేయగా, చివరికి ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా, ప్రమాదవశాత్తు మాత్రమే శ్రీదేవి మరణించిందని స్పష్టమైంది.
ఇదిలా ఉంటే, శ్రీదేవి చివరి కోరిక అంటూ సోషల్ మీడియాలో ఓ రెండు వర్గాలు తెగ హల్చల్ చేస్తున్నారు. ఏపీ రాజకీయాలలో విరోధులైన టిడిపి, వైసీపీ అభిమానుల అత్యుత్సాహంతో శ్రీదేవి పరువు తీస్తున్నారు. “2019లో చంద్రబాబును ప్రధానమంత్రిగా చూడాలన్నదే” శ్రీదేవి చివరి కోరికగా ఏబీఎన్ ఛానల్ లో ప్రసారమైనట్లుగా వైసీపీ వర్గాలు వ్యంగ్యంగా పోస్ట్ లు చేయగా, మరికొద్దిసేపటికే కౌంటర్స్ వచ్చాయి.
2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కంటే, దేశప్రధానిగా జగన్ మోహన్ రెడ్డిని చూడాలన్నదే శ్రీదేవి అంతిమ కోరిక అని, ఇటీవల జగన్ చేస్తోన్న పాదయాత్రను చూసి శ్రీదేవి ఎంతో కుమిలిపోయేదని, ఈ దిశగా సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా టిడిపి అభిమానుల నుండి కూడా వ్యంగ్యమైన కౌంటర్లు వెలువడ్డాయి. అయితే వీరిద్దరూ ఇలా సెటైర్లు వేసుకోవడానికి శ్రీదేవి మరణమే దిక్కా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.



