ఐదేళ్ళు పదవి, తిరుగులేని అధికారం అనుభవించిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోగానే అన్నీ ఒక్కసారిగా మంత్రం దండం తిప్పి మాయం చేసినట్లు మాయమైపోతాయి.
అది జీర్ణించుకోవడం చాలా చాలా కష్టం. కనుక కొందరు ఈవీఎంలను, ప్రజలను, వారిని మాయ చేసి అధికారంలోకి వచ్చిన ప్రత్యర్ధులను తిట్టుకుంటూ రెండు మూడేళ్ళయినా ఫామ్‌హౌసు లేదా ప్యాలస్‌లోనే ఉండిపోతారు.
తమిళనాడు మాజీ సిఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ కూడా ఎన్నికలలో ఓడిపోయింది. కానీ అయన చాలా త్వరగానే తేరుకున్నారు.
వెంటనే పార్టీ నేతలతో సమావేశమై ఓటమికి పూర్తి బాధ్యత నాదే అని ఒప్పుకున్నారు. వారితో మాట్లాడి పార్టీ ఓటమికి గల కారణాలు విశ్లేషించుకున్నారు. అయినప్పటికీ 36 మంది ముఖ్య నేతల అధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి పార్టీ ఓటమికి గల కారణాలు నేరుగా ప్రజల నుంచే తెలుసుకోవాలని నిర్ణయించారు.
పార్టీ అధినేత హుందాగా ఓటమిని ఒప్పుకోవడం, ఓటమికి పూర్తి బాధ్యత తీసుకోవడం, నేతలతో కలిసి ఆత్మవిమర్శ చేసుకొని జరిగిన తప్పులు, లోపాలను గుర్తించే ప్రయత్నం చేయడం ఒక మంచి రాజకీయ పార్టీకి ఉండాల్సిన మంచి లక్షణాలు.
తమ ఓటమికి దేనినో, ఎవరినో నిందిస్తూ చేతులు దులుపుకోవచ్చు. కానీ మీడియా… రాజకీయ విశ్లేషకులు ఊరుకోరు. అనేక కోణాలలో విశ్లేషించి చెపుతారు. లేదా ఏదో రోజు పార్టీలో నేతలే ఫలానా ఫలానా తప్పులు చేయడం వల్ల ఎన్నికలలో ఓడిపోయామని బయటపెడతారు… వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల నేతల్లాగ!
కనుక డీఎంకే పార్టీ ఓటమికి ఇబ్బందికరంకాని కొన్ని కారణాలు చెప్పుకొని చేతులు దులుపుకోకుండా, ఎన్నికలలో మా పార్టీ ఎందువల్ల ఓడిపోయింది? ఎందుకు తిరస్కరించారు? అని నేరుగా ప్రజలను కూడా అడిగి తెలుసుకోవాలనుకోవడం చాలా మంచి ఆలోచనే. కానీ ఆ ప్రజాభిప్రాయసేకరణ నిష్పక్షపాతంగా ఉండాలి తప్ప అధినేత కళ్ళలో ఆనందం కోసం అన్నట్లు సాగితే ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.
డీఎంకే అధినేత స్టాలన్ పార్టీ విషయంలో మంచి పద్దతులే అనుసరిస్తున్నారని అర్ధమవుతూనే ఉంది. కానీ విజయ్ ప్రభుత్వం జోలికి ఆరు నెలలు పోను. ఎటువంటి విమర్శలు చేయనని చెప్పి మాట తప్పారు.
“విజయ్ ఓ ఇన్‌స్టాగ్రామ్ సీఎం. టీవీకే పార్టీకి బూత్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు కూడా లేరు. సోషల్ మీడియాలో హైప్ సృష్టించుకొని రాజకీయ నాయకుడుగా గుర్తింపు సంపాదించుకున్నారు. యువతని ఆకట్టుకొని వారితో ఎన్నికల ప్రచారం చేయించుకొని. వారి ద్వారానే వారి కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేయించి ఓట్లు పడేలా చేసుకొని 118 సీట్లు గెలుచుకోగలిగారు,” అంటూ స్టాలిన్ విమర్శలు గుప్పించారు.
నేడు చెన్నైలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైనప్పుడు “విజయ్ ప్రభుత్వం ఏ రోజైనా కూలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం నిలబడినా 2029లో ముందస్తు ఎన్నికల వరకే అధికారంలో ఉంటారు. కనుక పార్టీలో అందరూ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి,” అని స్టాలిన్ హితవు చెప్పారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరిపడా ఎమ్మెల్యేలు లేక విజయ్ ఆపసోపాలు పడుతున్నప్పుడు, మాజీ సిఎం స్టాలిన్ తమ మిత్రపక్షాల చేత టీవీకే పార్టీకి మద్దతు ఇప్పించారు. ఆ తర్వాత కూడా చాలా హుందాగా మాట్లాడారు. రాజకీయాలలో ఇటువంటి హుందాతనం అవసరమంటూ ప్రజలు, మీడియా ఆయన తీరుని అభినందించారు కూడా.
కానీ ఇప్పుడు ఆయనే ఈవిధంగా మాట్లాడుతుండటం గమనిస్తే రాజకీయ నాయకులు ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమని అర్ధమవుతుంది.
ఆయన కూడా విజయ్ ప్రభుత్వం కూలిపోతుందని లేదా కూలిపోవాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాగే కోరుకుంటున్నారన్న మాట! కానీ పిల్లి శాపాలకు ఉట్టి తెగదు కదా?
ఒకవేళ డీఎంకే మిత్రపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నా ఇప్పుడు 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నారు కదా? కనుక 2029లో జమిలి ఎన్నికల వరకు స్టాలిన్ ఎదురుచూడక తప్పదు.




