రాజకీయాలలో మెట్టు దిగడం.. ఇలా కాదు!

Stepping Down in Politics

ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలలో లోపాలను ప్రశ్నించడం, అవినీతి, అసమర్ధతని ప్రశ్నించడం వరకే ప్రతిపక్షాలు పరిమితమైతే ఖచ్చితంగా రాజకీయాలు ఈవిదంగా ఉండేవి కావు.

ఒకప్పుడు.. అంటే 30-40 ఏళ్ళ క్రితం కూడా రాజకీయ పార్టీలు, నాయకులు పరస్పరం విమర్శించుకునేవారు. పార్టీలు మారేవారు. వాగ్ధానాలు, హామీలు ఎన్నికల ప్రచారం కోసమే అన్నట్లు అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పడేసేవారు. ప్రజలు సైతం వారిని తప్పు పట్టేవారు కారు. కనుక రాజకీయాలు చాలా ప్రశాంతంగా, హూందాగా సాగేవి. నాయకులు, ప్రజలు ప్రశాంతంగా నిద్రపొగలిగేవారు.

ADVERTISEMENT

ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు పంచిపెడుతూనే ఉన్నాయి. అభివృద్ధి పనులు కూడా చేస్తూనే ఉన్నాయి. కానీ అటు అధికార, ప్రతిపక్షాలకు ఇటు ప్రజలకు కూడా మనః శాంతి ఉండటం లేదు.

అధికారంలోకి ఉన్న పార్టీ తమ రాజకీయ ప్రత్యర్ధులను చావు దెబ్బతీసి, అడ్డులేకుండా చేసుకోవడానికి ఓ మెట్టు దిగితే, దానిని నిలువరించి తమ మనుగడ కాపాడుకోవడం కోసం వాటి ప్రత్యర్ధులు కూడా రెండు మెట్లు దిగేందుకు వెనకాడటం లేదు.

ఓ సమస్యపై ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు పట్టువిడుపులు ప్రదర్శించి సమస్యని పరిష్కరించేందుకు ఓ మెట్టు దిగినా తప్పులేదు. కానీ తమ రాజకీయ ప్రత్యర్ధిని దెబ్బ తీసేందుకు ఒక్కో మెట్టు దిగుతుంటే ముందుగా నష్టపోయేది ఆ రాజకీయ పార్టీలు, వాటి నాయకులే… ఆ తర్వాత సామాన్య ప్రజలు కూడా ఏదో రూపంలో మూల్యం చెల్లించక తప్పదు.

ఒకప్పుడు బీహార్, యూపీ, తమిళనాడు రాష్ట్రాలలో ఇటువంటి రాజకీయ పోకడలు కనపడేవి. కానీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అక్కడి కంటే భయంకరమైన రాజకీయ పోకడలు కనిపిస్తున్నాయి.

గమ్మత్తైన విషయం ఏమిటంటే అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోని రాజకీయ పార్టీలు, నాయకులే ప్రతిపక్షంలోకి మారిన తర్వాత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సాయం ఆశిస్తుంటారు. ఆ రెండింటి సాయంతోనే తాము ఎదుర్కొంటున్న రాజకీయ సమస్యల నుంచి బయటపడాలనుకుంటారు.

తాము ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకుంటున్నామని, న్యాయపోరాటాలు చేస్తామని, న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యమే చివరికి గెలుస్తుందని, వాటిని కాలరాసిన వారే మీడియా ముందుకు వచ్చి చెపుతుంటే ప్రజలు నవ్వుకోకుండా ఉండగలరా?

ఈ రాజకీయాల వలన ఆయా రాజకీయ పార్టీలు, వాటి నేతలు, కార్యకర్తలు ఎలాగూ మూల్యం చెల్లించక తప్పదు. కానీ నానాటికీ దిగజరుతున్న ఈ రాజకీయాలతో ఎటువంటి సంబందమూ లేని సామాన్య ప్రజలు సైతం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మూల్యం చెల్లించక తప్పడం లేదు.

ఈ ధోరణి ఇలాగే కొనసాగితే అందరూ నష్టపోతారు. దేశంలో ప్రతీ ఒక్కరూ రాజకీయ బాధితులుగా మారుతారు. ఈ విషయం ప్రజల కంటే రాజకీయాలలో ఉంటూ మూల్యం చెల్లిస్తున్న నేతలకే బాగా తెలుసు. కనుక ఈ విపరీత ధోరణికి ఎవరో ఒకరు బ్రేక్ వేయడం చాలా అవసరం. కానీ ఎవరు వేస్తారు? ఎప్పుడు వేస్తారు? ఎలా వేస్తారు?

ADVERTISEMENT
Latest Stories