రాష్ట్ర విభజనతోనే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి తారుమారైంది. ఈ మూడేళ్ళ వైసీపీ పాలనలో అది ఇంకా దిగజారింది. ప్రభుత్వం ఆదాయం పెంచుకొనేందుకు ఐటి కంపెనీలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలను ఆకర్షించలేకపోతుండటంతో ఓ వైపు ఎడాపెడా అప్పులు చేస్తూ మరోవైపు పన్నులు, ఛార్జీలు పెంచేస్తూ ప్రజలపై భారం వేస్తూ అదే ఆదాయంగా భావిస్తోంది.
వైసీపీ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ, దూరదృష్టి రెండూ లేకపోవడంతో సంక్షేమ పధకాల ప్రచారం కోసం కూడా వందల కోట్లు ఖర్చు చేస్తోంది. మరోపక్క రాజకీయ కక్షలు, పంతాల కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు నడిపిస్తూ వాటి కోసం వందల కోట్లు ఖర్చు చేస్తోంది. ఐపిఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వరరావు సస్పెన్షన్ కేసు, వైఎస్ వివేకానంద రెడ్డి కేసు, తాజాగా పోలవరం ప్రాజెక్టులోని గ్రీన్ ట్రిబ్యూనల్ కేసులను ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ చట్టం ఉల్లంఘనలకు పాల్పడినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటి) ఏపీ ప్రభుత్వానికి రూ.120 కోట్లు జరిమానా విధించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
జస్టిస్ సిటీ రవికుమార్, జస్టిస్ అజయ్ రస్తోగీల కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం ఈ కేసు విచారణను చేపట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ హాజరుకావలసి ఉండగా ఆయనకు వేరే కేసుకి హాజరు కావలసి ఉండటంతో రాలేకపోరు. మరో ప్రభుత్వ న్యాయవాది ఇదేవిషయం సుప్రీంకోర్టుకి మనవి చేస్తుండగా ఇంతలో మరో సీనియర్ అడ్వకేట్ వెంకట రమణి ఈ కేసు వాదించేందుకు రావడంతో న్యాయమూర్తులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అభిషేక్ సింఘ్వీ, వెంకట రమణి ఇద్దరూ దేశంలో పేరుమోసిన న్యాయవాదులే. వారి ఫీజులు రోజుకి లక్షల రూపాయలు ఉంటుంది.
ఈ కేసుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు ప్రముఖ న్యాయవాదులను నియమించుకోవడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పందిస్తూ, “ఈ కేసుని వాదించడానికి ఇంతమంది లాయర్లను నియమించుకొని ఇంత డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం ఏమిటి?ఈ కేసులో లాయర్లకు పెట్టే సోమ్మేదో పర్యావరణం కోసం ఉపయోగిస్తే బాగుండేది కదా?ఏపీ ప్రభుత్వానికి ఈ కేసుపై ఉన్న శ్రద్ద పర్యావరణంపై లేదని అర్దమవుతోంది. ఈ కేసు వాదించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో లెక్కలు అడుగుతాం,” అని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇవికాక నష్టపరిహారం కోరుతూ నిర్వాసితులు వేసిన కేసులు, ఇంకా ఇటువంటి అనేక కేసులు నడుస్తున్నాయి. వీటన్నిటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.100 కోట్లు పైనే ఖర్చుపెట్టి ఉండవచ్చని ప్రతివాది పెంటపాటి పుల్లారావు తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకి తెలియజేశారు. ఇదికాక ఎన్‌జీటికి రూ.120 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఎన్‌జీటి కేసులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో గెలిచినా, ఈ కేసు వాదన కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు తిరిగిరాదు కదా?సుప్రీంకోర్టు చెప్పినట్లు ఈ కోర్టు కేసులకి, ఎన్‌జీటికి వందల కోట్లు చెల్లించే బదులు, ఇటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుంది కదా?



