వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రతి అంశం మీద కోర్ట్ మెట్లు ఎక్కడం న్యాయస్థానాలతో మొట్టికాయలు తినడం సర్వ సాధారణంగా మారిపోయింది.హై కోర్ట్ కాదంటే ఇక్కడ తిన్న మొట్టికాయిలు సరిపోలేదంటూ సుప్రీం కోర్ట్ తలుపు తట్టడం జగన్ ప్రభుత్వానికి ఆనవాయితీగా తయారయ్యింది.
151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడు రాజధానులు అంటూ వైసీపీ మొదలుపెట్టిన రాజకీయ చదరంగంలో హై కోర్ట్, సుప్రీం కోర్ట్ లు కూడా ఒక భాగమయ్యాయి. 2014 రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులు మూడు రాజధానుల నిర్ణయంతో తమకు అన్యాయం జరుగుతుంది అంటూ కోర్ట్ ను ఆశ్రయించారు. అయితే కోర్టులో తమ వాదన వినిపించడానికి వైసీపీ ప్రభుత్వం కూడా న్యాయస్థానాన్ని నమ్ముకుంది.
అయితే వీరి వాదనలో హై కోర్ట్ రైతుల పక్షానే న్యాయం ఉంది అని తీర్పుఇవ్వడంతో ఇక సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది వైసీపీ ప్రభుత్వం. ఈ కోర్టులలో ఐదేళ్ల పాటు సాగిన ఈ మూడు రాజధానుల పంచాయితీతో నేటికీ జగన్ కల నెరవేరలేదు. ఇక రేపు వచ్చే ఫలితాలతో కూటమి పార్టీ అధికారంలోకి వస్తే జగన్ మూడు రాజధానుల కల ఎప్పటికి నెరవేరే అవకాశమే లేదు.
ఇక రాజధానుల సంగతి అటుంచితే ప్రభుత్వ భవనాలకు వైసీపీ పార్టీ రంగులు వేయడంతో వాటిని మార్చాలంటూ ప్రతిపక్షాలు, అవసరం లేదంటూ వైసీపీ మరోసారి కోర్ట్ లో పంచాయితీకి సిద్ధమయ్యారు. అయితే ఇందులోనూ వైసీపీ రంగులో కాలేసింది. వెంటనే ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ రంగులను తొలగించాలంటూ జగన్ ప్రభుత్వానికి మరో మొట్టికాయ వేసింది న్యాయస్థానం.
అలాగే రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు కోసం సేకరించిన భూమిని పేదలకు కేటాయిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా న్యాయస్థానాలు తప్పుబట్టాయి. ఇసుక పాలిసీ మొదలు లిక్కర్ పాలిసీ వరకు అన్నిటికి న్యాయస్థానంలో సంజాయిషీ ఇవ్వాల్సిన దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం పని చేసింది. వైసీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాల నుండి ప్రభుత్వ అధికారి, సామాన్యుడు వరకు అందరూ కోర్ట్ మెట్లెక్కినవారే కావడం విశేషం.
అధికార పార్టీ ఎంపీ తన సొంత నియోజకవర్గానికి వెళ్లాలన్న, ఒక ప్రతిపక్ష నేత తన పార్టీ కార్యక్రమాలు జరుపుకోవాలన్న, చివరికి ఒక ఉన్నతాధికారి తన ఉద్యోగాన్ని తిరిగి దక్కించుకోవాలన్న కూడా కోర్ట్ అనుమతులు తీసుకు వచ్చే పరిస్థితిలోకి రాష్ట్రానికి తీసుకు వచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది. న్యాయస్థానాల తీర్పులతో ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చిన రికార్డు ఒక పక్క, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలు ఇంతపెద్ద సంఖ్యలో తీర్పులు వెల్లడించిన చరిత్రను మోస్తూ మరో పక్క వైసీపీ రాష్ట్ర పరువును కోర్ట్ మెట్ల ముందు దిగజారుస్తూనే ఉంది.
గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఋషి కొండకు గుండు కొట్టారు అంటూ ప్రతిపక్షాలు కోర్ట్ మెట్లెక్కితే గ్రీన్ మ్యాట్ తో న్యాయస్థానానికి బాహుబలి గ్రాఫిక్స్ చూపించి నిర్మాణాలను చేపట్టింది వైసీపీ ప్రభుత్వం. ఒక పక్క కోర్టులతో మొట్టికాయలు తింటూ మరో పక్క న్యాయస్థానాలను ఏ మారుస్తూ ఐదేళ్ల పాలన మొత్తం కేసులు, జైళ్లు, బైళ్ళు, విచారణలు, వాదనలు అంటూ మొత్తం న్యాయస్థానాల చుట్టే తిరిగింది వైసీపీ ప్రభుత్వం.
వైసీపీ ప్రభుత్వం చివరి అంకంకు చేరే దశలో కూడా న్యాయస్థానం తలుపు తట్టారు వైసీపీ నేతలు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో అభ్యంతరాలను లేవనెత్తుతూ హైకోర్టు ను ఆశ్రయించింది వైసీపీ ప్రభుత్వం. పోస్టల్ బ్యాలెట్ ఓటరు డిక్లరేషన్ కు సంబందించిన ఫామ్ 13 ఏ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు ఆయన పేరు, హోదా, అధికార ముద్ర ఉండాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30 న ఉత్తర్వులు జారీ చేసింది.
దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ హై కోర్ట్ ను ఆశ్రయించగా ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమంటూ జూన్ 1 న తీర్పు వెల్లడించింది. అయితే హై కోర్ట్ లో పోయిన పరువు చాలలేదు అన్నట్టుగా సుప్రీం కోర్ట్ తలుపు తట్టారు వైసీపీ ప్రభుత్వం. అయితే విచారణ చేపట్టిన ధర్మాసనం కూడా హై కోర్ట్ వాదననే బలపరుస్తూ ఈ విషయంలో కోర్ట్ జోక్యం సరికాదు అంటూ వైసీపీ కి చివరి మొట్టికాయ ఇచ్చింది. దీనితో ఈ ఐదేళ్ల నుంచి న్యాయస్థానాలలో పోగొట్టుకున్న ‘పరువు చాలు మహాప్రభో’ అంటూ సోషల్ మీడియాలో వైసీపీ మీద కౌంటర్లు పేలుతున్నాయి.




