ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ప్రత్యేక అతిధిగా విచ్చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ గొప్పతనాన్ని, చంద్రబాబు తో తనకున్న సాన్నిహిత్యాన్ని వివరిస్తూ చంద్రబాబు 2020 విజనరీని తనకు ముందే తెలిపారని చెప్పిన విధంగానే సైబరాబాద్ నిర్మాణం చేప్పట్టడంతో ఆయనకున్న భవిష్యత్ ప్రణాళికలకు తానూ ఆచ్యర్యపోయాను అంటూ బాబుని కొనియాడారు.
ఈ రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ ను తప్ప మరే నేతను ప్రశంసించకూడదు అన్నట్లుగా వరుస పెట్టి వైసీపీ నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి రాజకీయాలతో సంబంధం లేకుండా రజనీకాంత్ పై విరుచుకుపడ్డారు. ఆయన వయస్సుకి, సినీరంగంలో ఆయన స్థానానికి అయినా కనీస మర్యాద కూడా ఇవ్వకుండా కొడాలి నాని, పేర్ని నాని, రోజా ఇలా పలువురు నేతలు హద్దులు దాటి తలైవా పై మాటల దాడిని కొనసాగించారు.
సినీ పరిశ్రమ నుండి వచ్చిన రోజా కూడా తోటి నటుడిగా కనీస మర్యాద లేకుండా రజనీకాంత్ మీద చేసిన విమర్శలు పక్క రాష్ట్రాలలో ఆంధ్రరాష్ట్ర రాజకీయాల స్థాయిని దిగజార్చిందనే చెప్పాలి. సూపర్ స్టార్ అభిమానులే కాదు సాధారణ పౌరులు సైతం ఏపీలో వైసీపీ నేతల రాజకీయ విమర్శలను చూసి ఈసడించుకునే పరిస్థితికి తీసుకువచ్చారు. తమిళనాట మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ప్రాంతీయ అభిమానం కాసంత ఎక్కువనే చెప్పాలి.
రజనీకాంత్ మీద వైసీపీ నేత మాటల దాడికి అటు తమిళనాడు సినీ పరిశ్రమ నుండి గట్టి కౌంటర్లే పడతాయి అని ఆశించినవారికి నిరాశే ఎదురైందని ఒప్పుకోక తప్పదు. అయితే రజనీకి మద్దతు తెలిపితే తాముకూడా ఇటువంటి విమర్శలనే ఎదుర్కోవాల్సి వస్తుందని భావించే సినీ పరిశ్రమ మౌనం వహించిందేమో అనుకున్న ఏపీ, తమిళ ప్రజలకు ఇప్పుడు తమిళ సీనియర్ నటీమణులు పెద్ద షాకే ఇచ్చారని చెప్పాలి.
తాజాగా టీడీపీ నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రోజా పై చేసిన విమర్శలకు కౌంటర్లు తమిళ సినీ రంగం నుండి రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రోజా పై బండారు చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని వాటిని మేము ఖండిస్తున్నాం అంటూ రాధికా, కుషుబు వంటి సీనియర్ నటీమణుల ప్రకటనలు రజనీ అభిమానుల ఆగ్రహానికి కారణాలయ్యాయి.
ఇదే వైసీపీ నాయకులు రజనీకాంత్ ను కించపరుస్తూ అమానవీయంగా చేసిన విమర్శలు వీరికి వినపడలేదా? అప్పుడు రాని ఈ ఖండన ప్రకటనలు ఇప్పుడు ఎవరి ప్రాపకం కోసం అంటూ సోషల్ మీడియాలో రజనీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. రజని మీద లేని ప్రేమ రోజా మీద ఎందుకు? అంటూ ప్రశ్నిస్తున్నారు.





