వచ్చే ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేయడం కోసం నియోజకవర్గాల వారీగా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే ఈ సమావేశాలలోనే అసంతృప్తి జ్వాలలు, అసమ్మతి సెగలు, పార్టీ నేతల మద్య నివురు గప్పిన నిప్పులా దాగి ఉన్న విభేధాలు, నేతల పరస్పర విమర్శలు, ఆరోపణలు బయటపడుతుండటం విశేషం.
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో సోమవారం స్థానిక ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు అధ్యక్షతన ప్లీనరీ సమావేశం జరిగింది. దానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడుతుండగా కొందరు పార్టీ కార్యకర్తలు లేచి బయటకు వెళ్ళిపోవడం చూసి ఆమె షాక్ అయ్యారు.
వారు బయటకు వెళ్ళిపోకుండా హాల్ తలుపులు మూసివేయడంతో, వారు తలుపులపై గట్టిగా బాదుతూ తలుపులు తీయాలని బిగ్గరగా అరవడం మొదలుపెట్టారు. దాంతో ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు లేచి మైకు అందుకొని “పార్టీలో ఉండదలచుకొన్నవారు ఉంటారు…పోయేవారుపోతారు. బయటకు పోయేవారిని ఎవరూ బ్రతిమలాడుకోనవసరం లేదు. వాళ్ళని బయటకు పంపించేయండి,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ తరువాత హోంమంత్రి తానేటి వనిత మిగిలిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వైసీపీలో కార్యకర్తలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. నామినేటడ్ పోస్టులు, వాలంటీరు పోస్టులు అన్నీ మనోళ్ళకే ఇచ్చుకొంటున్నాము కదా? అయినా పార్టీలో కష్టపడేవారికి గుర్తింపు లేదని కొందరు దుష్ప్రచారం చేయడం తగదు,” అని అన్నారు.
మూడు రోజుల క్రితం శ్రీకాకుళంలో జరిగిన వైసీపీ ప్లీనరీలో ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో పార్టీ అభ్యర్ధిని నేనే. నాకే టికెట్ లభిస్తుందని అందరికీ తెలుసు. కానీ పార్టీలో కొందరు మేము కూడా రేసులో ఉన్నామని కొందరు ప్రచారం చేసుకొంటున్నారు. నాకేమీ తెలియదని.. నేను అమాయకుడినని అనుకొంటున్నవాళ్ళే అమాయకులు. నాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నవారెవరో నాకు తెలుసు. ఇటువంటి పనులు మానుకోకపోతే సిఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తాను,” అని హెచ్చరించారు.
రాష్ట్రంలో మిగిలిన అన్ని నియోజకవర్గాలలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశాలలో కూడా ఇంచుమించు ఇలాగే సాగుతున్నాయి. అవి ఏవిదంగా సాగుతున్నాయో తెలుసుకొనేందుకు ఈ రెండూ చక్కటి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
కొసమెరుపు ఏమిటంటే, ఇంతకాలం వాలంటీరు పోస్టులను పార్టీలకు అతీతంగా అందరికీ ఇస్తున్నామని వైసీపీ నేతలు చెప్పుకొనేవారు. కానీ వైసీపీ కుటుంబాలకే వాలంటీరు పోస్టులు ఇస్తున్నామని హోంమంత్రి స్వయంగా బయటపెట్టారు. వైసీపీ కార్యకర్తలకు ఆర్ధికసాయం చేసేందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ వ్యవస్థను సృష్టించి, ఒక్కొక్కరికీ నెలనెలా రూ.5,000 చొప్పున లక్షల మందికి చెల్లిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. అయితే వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వం నేరుగా డబ్బు నెలనెలా చెల్లిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని, జగన్ ఈ వాలంటీర్ వ్యవస్థని సృష్టించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.



