TDP BRS YCP

గత 40 ఏళ్ళుగా టీడీపీ, గత 25 ఏళ్ళుగా బిఆర్ఎస్ పార్టీ, గత 13 ఏళ్ళుగా వైసీపీ రాజకీయాలలో ఉన్నాయి. వీటిలో టీడీపీ ఎదుర్కొన్నన్ని ఆటుపోట్లు ఆ రెండు పార్టీలు పెద్దగా ఎదుర్కోలేదనే చెప్పొచ్చు.

ఉద్యమ సమయంలో బిఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తూ అనేక సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ, దానితో పాటు మిగిలిన పార్టీలు, వివిద ఐకాసాలు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఆ ఆటుపోట్లు సమానంగా భరించారు.

Also Read – జగన్‌ పరామర్శ కార్యకర్త కోసం కాదట!

తెలంగాణ ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ దశ తిరిగింది. కల్వకుంట్ల కుటుంబం ఎంత చెపితే అంత అన్నట్లు తొమ్మిదిన్నరేళ్ళ పాలన సాగింది. ఆ సమయంలోనే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారింది. ఏపీలో జగన్‌కి కూడా ప్రజలు ఒక్క భారీ ఛాన్స్ ఇస్తే ఏవిదంగా దుర్వినియోగం చేసుకున్నారో అందరూ చూశారు.

ఇంత శక్తివంతమైన నాయకత్వం కలిగిన ఈ రెండు పార్టీలు ఎన్నికలలో తుడిచిపెట్టుకు పోవడమే విచిత్రమనుకుంటే, ఒకే ఒక్క ఓటమితో ఇంతగా బలహీనపడటం, అక్కడ కల్వకుంట్ల కుటుంబంలో, ఇక్కడ జగన్‌ కుటుంబంలో పదవుల కోసం కుమ్ములాటలు మొదలవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటువంటి సమస్యలు వస్తాయని జగన్‌ ముందే పసిగట్టారు. కనుకనే తెలివిగా ముందే తల్లిని, చెల్లిని బయటకు సాగనంపేశారు.

Also Read – ‘పోరు’ బాటలు కాదు ‘ప్రతీకార’ చర్యలే…

తమిళనాడులో ద్రవిడ పార్టీల విధానాలు తమకి ఆదర్శప్రాయమని, వాటిని మరింత లోతుగా అధ్యయనం చేయాలని కేసీఆర్‌ చెపుతుండేవారు. కానీ పక్కనే ఉన్న ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా టీడీపీని చాలా సమర్ధంగా, విజయవంతంగా నడుపుతున్నారని అంగీకరించడానికి కేసీఆర్‌ ఇష్టపడలేదు.

ఒకవేళ కేసీఆర్, జగన్‌ ఇద్దరూ చంద్రబాబు నాయుడు పట్ల తమ ద్వేషాన్ని పక్కన పెట్టి, ఆయన పార్టీని నడిపిస్తున్న తీరు నిశితంగా గమనించి వారు కూడా అటువంటి ఆలోచనలతో, విధానాలతో తమ పార్టీలను నడిపించుకొని ఉంటే నేడు ఈ దుస్థితి కలిగి ఉండేదే కాదని చెప్పవచ్చు.

Also Read – వైసీపీ లెక్క తప్పుతుందా.?

అయినా టీడీపీ 40 ఏళ్ళుగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని విజయవంతంగా ముందుకు సాగుతుంటే, తమ పార్టీలు పుట్టిన 13-25 ఏళ్ళకే ఇటువంటి దయనీయ స్థితిలో ఎందుకున్నాయని కేసీఆర్‌, జగన్‌ ఆలోచించాల్సిన సమయం ఇదే.

బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయి, అత్యంత దయనీయ పరిస్థితిలో రజతోవత్స సభ జరుపుకుంది. ఆ సభతో మళ్ళీ పుంజుకోవాలనుకుంది.

కానీ ఆ సభ తర్వాతే బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసేయాలని కేసీఆర్‌ ఆలోచనలు చేస్తున్నారంటూ కల్వకుంట్ల కవిత బాంబు పేల్చారు. పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. ఆ సభ తర్వాతే కేటీఆర్‌-కవిత, కేటీఆర్‌-హరీష్ రావుల మద్య లుకలుకలు కూడా బయటపడ్డాయి.

కొడుకు, కూతురు, మేనల్లుడు మద్య జరుగుతున్న యుద్ధాలతో పార్టీ నిలువునా చీలిపోయే ప్రమాదం ఉందని తెలిసి ఉన్నా కేసీఆర్‌ మాట్లాడలేకపోతున్నారంటే, ఆయన ఎంత నిస్సహయ స్థితిలో ఉన్నారో అర్దం చేసుకోవచ్చు.

బహుశః అందుకేనేమో రజతోవత్స సభలో “ఇక జరుగబోయేది కురుక్షేత్ర మహా సంగ్రామమే” అని గర్జించిన కేసీఆర్‌ మళ్ళీ ఫామ్‌హౌస్‌లో పడకేశారు.

అక్కడ కేసీఆర్‌, ఇక్కడ జగన్‌ ఇద్దరూ కూడా వారి అహంభావం వల్లనే స్వయంగా నష్టపోయి, తమ పార్టీలని కూడా నష్టపరుచుకున్నారు.

మరో విషయం ఏమిటంటే, వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలకు వేరే పార్టీలతో పొత్తులు లేవు కనుక అధికారంలో ఉన్నప్పుడు ఎవరితో సర్దుకుపోవలసిన అవసరం ఉండేది కాదు. కనుక ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు సాగేది.

కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జనసేన, బీజేపిలతో సర్దుకుపోతూ, నొప్పించక తానొవ్వక అన్నట్లు పాలన సాగించాల్సి ఉంటుంది. అయినా కూడా చక్కటి సమన్వయంతో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

అంటే పార్టీని, ప్రభుత్వాన్ని ఏవిదంగా నడిపించుకోవాలో చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవలసి ఉందన్న మాట. కానీ అందుకు వారికి అహం అడ్డొస్తోంది. కనుక అదే వారి పార్టీల పాలిట శాపంగా మారుతోందని చెప్పొచ్చు.