నేడు తెలుగు దేశం పార్టీ 44వ వార్షికోత్సవం. నాడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడితే, ఆంధ్రా ప్రజల ఆత్మగౌరవం అమరావతిని నిర్మించేందుకు చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారు.
1982, మార్చి 29న నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించిన ఆ స్పూర్తితోనే అనేక ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి.
నాటి నుంచి నేటి వరకు తెలుగు దేశం పార్టీ సుదీర్గ ప్రస్థానంలో అనేక కొత్త రాజకీయ ఒరవడులు ప్రవేశపెట్టింది. సమాజంలో అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వాములను చేసింది. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా నడిపిస్తోంది. అంతేకాదు.. ప్రజలలో నిజమైన రాజకీయ చైతన్యం రగిలించింది.
ఆలోచనలకు, కాగితాలకే పరిమితమైన పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన వంటి వాటిని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసి చూపింది.
అలాగని తెలుగు దేశం పార్టీ ప్రస్తానం పూలనావలా సాగిపోలేదు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉంది. రాష్ట్ర విభజన తెలుగు దేశం పార్టీ ఉనికి, మనుగడ, వైఖరికి సవాలుగా మారింది. విభజన వల్ల తెలంగాణలో టీడీపికి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిగిన ఎదురుదెబ్బలు, నష్టం అంతా ఇంతా కాదు. కానీ చంద్రబాబు నాయుడు ధైర్యంగా నిలబడి ఒక్కో సమస్యని పరిష్కరించుకుంటూ ముందుకు సాగారు.
గత ప్రభుత్వ హయంలో చంద్రబాబు నాయుడుకి మళ్ళీ అగ్నిపరీక్షలు ఎదురయ్యాయి. ఓటమి నుంచి గుణ పాఠాలు, సమస్యలు, సవాళ్ళలో అవకాశాలు వెతుక్కోవాలని చంద్రబాబు నాయుడు చెపుతుంటారు. అదే స్పూర్తితో పార్టీని ముందుండి నడిపించారు.
ఆయనని జైల్లో పెడితే తెలుగు దేశం పార్టీ కుప్ప కూలిపోతుందనుకున్నవారికి తన మనోధైర్యం, రాజకీయ చాతుర్యంతో చంద్రబాబు నాయుడు పెద్ద షాక్ ఇచ్చారు. జైలు జీవితం ఆయనను బలహీనపరచలేదు. మరింత దృఢపరిచింది. ప్రత్యర్ధులు, శత్రువుల గురించి మరింత తెలుసుకునేల చేసింది. మరింత అప్రమత్తం చేసింది. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా చేసింది.
టీడీపిని, ఏపీని, తనని, తనని నమ్ముకున్నవారిని దెబ్బ తీయాలనుకున్న ప్రతీ ఒక్కరికీ చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్టులు ఉదారంగా పంచిపెట్టారు. వాటిని వారు మౌనంగా స్వీకరించక తప్పలేదు.
తెలుగు దేశం పార్టీ అంటే నాట్ జస్ట్ రాజకీయాలు, పదవులు, అధికారం. తెలుగు దేశం పార్టీ అంటే రాష్ట్రాభివృద్ధి… ఆంధ్రులు గర్వపడే అమరావతి నిర్మాత. ఏపీ జీవనాడి పోలవరం నిర్మాత.
లక్షలాది నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు పించన్లు, ఉద్యోగాలు, ఉపాధి కల్పించే కామధేనువు. కరువు పీడిత రాయలసీమకు నీళ్ళు అందించే భగీరధుడు అని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపిస్తున్నారు.
ప్రజలు మళ్ళీ రాజకీయ ప్రయోగాలు చేయకుండా ఉంటే రాబోయే పదేళ్ళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఇంక ఎవరూ అడ్డుకోలేరు. దేశంలోనే నం.1గా నిలవడం తధ్యం!






