ఈసారి శాసనసభ ఎన్నికలలో తప్పనిసరిగా గెలిచి అధికారంలోకి రావడం టిడిపికి చాలా అవసరం. లేకుంటే 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో టిడిపిని నామరూపాలు లేకుండా జగన్ తుడిచిపెట్టేయడం ఖాయం. కనుక చంద్రబాబు నాయుడు ఈసారి తన వ్యూహాలకు అప్పుడే పదును పెట్టి అమలుచేయడం మొదలుపెట్టారు.
రాష్ట్ర ప్రజలు భారీ మెజార్టీతో వైసీపీని గెలిపిస్తే అది ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లు సాగిపోతుండటం వలన ప్రజలు మార్పు కోరుకొంటున్నారు. ఇది టిడిపికి చాలా కలిసి వచ్చే అంశమే. రాష్ట్రంలో టిడిపికి అనుకూల వాతావరణం నెలకొంది కనుక ఈసారి ఎన్నికలలో సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగేందుకు సిద్దమవుతున్నారు.
ఇందుకు తాజా ఉదాహరణగా వైసీపీ అడ్డాగా పేరొందిన కడపలో నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా మాధవీ రెడ్డిని నియమించడమే. చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా మాజీ ఐఏఎస్ అధికారి బి.రామాంజనేయులను నియమించారు. వచ్చే ఎన్నికలలో వారికే టికెట్స్ ఇవ్వబోతున్నట్లు భావించవచ్చు.
ఇక కడప విషయానికి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ, ఆ తర్వాత బలిజ, రెడ్డి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కనుక గత మూడు దశాబ్ధాలుగా ఇక్కడ మైనార్టీ అభ్యర్ధులే విజయం సాధిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కన బెట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళకు అవకాశం కల్పించేందుకు సిద్దమయ్యారు.
పలుమార్లు సర్వే చేయించి, ఆమెను బరిలో దింపితే విజయావకాశాలు ఉంటాయని ధృవీకరించుకొన్న తర్వాతే ఆమెకు కీలకమైన ఈ బాధ్యత అప్పగించారు. ఆమె టిడిపి పాలిట్ బ్యూరో శ్రీనివాసులు రెడ్డి సతీమణి. కనుక ఆమెతో పాటు ఆయన కూడా పోటీ చేస్తున్నట్లే లెక్క. కనుక ఈసారి కడపలో పసుపు జెండా ఎగరాల్సిందే.



