కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంతో టీడీపీ బీజేపీ మధ్య అగాధం ఏర్పడింది. ఈ సమయంలో ఒక పార్టీపై ఇంకో పార్టీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడుల సమావేశం నేపథ్యంలో రెండు వైపుల వారు తాత్కాలికంగా సంధి పాటిస్తున్నారు.
ఇంత ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతున్నప్పుడు కూడా రెండు వైపుల వారు రాజకీయ విమర్శలు చేసుకుంటే పెట్టుబడిదారుల ముందు పలచన అయ్యేవారు. ఒకరకంగా రెండు వైపుల వారిని దీనిని అభినందించాలి. అయితే పూర్తిగా ఇబ్బందులు లేకపోవడం లేదు. ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరుగురు కేంద్ర మంత్రులని పిలుస్తే బీజేపీ నుండి కేవలం సురేష్ ప్రభు మాత్రమే హాజరయ్యారు.
టీడీపీతో విబేధాల కారణంగా మిగతా బీజేపీ మంత్రులు దూరంగా ఉన్నట్టు సమాచారం. సదస్సుకు హాజరయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పొగడాల్సి వస్తుందని వారు ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో నలబై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు అభినందనలు తెలియజేశారు.
అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు, విశాఖ(ఉత్తర) శాసనసభ్యుడు విష్ణు కుమార్ రాజు కూడా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. హరిబాబు ఈ మొత్తం ఎపిసోడ్ లో కొంత సమన్వయంతో వ్యవహరించినా, విష్ణు కుమార్ రాజు టీడీపీపై బానే విరుచుకుపడేవారు. నేటితో సదస్సు పూర్తి అవుతుండడంతో రేపటినుండి మళ్ళీ రాజకీయం మొదలవుతుందేమో చూడాలి.



