ఎవరి గెలుపు కోసం…మీ ఈ కుస్తీలు!

TDP Janasena

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రజాస్వామ్య విధానాలను అడ్డుకట్ట వేయడానికి, రాష్ట్రంలో హేతుబద్దమైన, సుస్థిర పాలన అందించడానికి టీడీపీ – జనసేన పొత్తు అవసరం అంటూ రెండు పార్టీల అధినేతలు తమనిర్ణయాన్ని ప్రజల ముందుంచారు. అలాగే రెండు పార్టీల కింద స్థాయి నేతలనుండి పొత్తు ధర్మాన్ని బలపరుస్తూ రావాలంటూ ఇరు పార్టీల క్యాడర్ కు తమ తమ అధినేతల నుండి ఆదేశాలు జారీఅయ్యాయి.

పార్టీలోని అగ్ర స్థాయి నాయకత్వం తమ పార్టీ అధినేతల ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తూ రెండు పార్టీల ఉమ్మడి కార్యచరణకు, ఉమ్మడి మానిఫెస్టో విడుదలకు సిద్దమైన తరుణంలో కొన్ని కొన్ని ప్రాంతాలలో టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలలో కార్యకర్తలు, కొంత మంది నేతలు రెండు పార్టీల ఉమ్మడి లక్ష్యాన్ని ఛేదించే విధంగా వ్యవహరిస్తున్న దృశ్యాలు రెండు పార్టీల అధినేతలను కంగారుపెడుతున్నాయి.

ADVERTISEMENT

టీడీపీ పార్టీకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని అలాగే చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని, జనసైనికులు ఎవరు టీడీపీ క్యాడర్ ను తక్కువచేసి మాట్లాడొద్దని, అలాగే రెండు పార్టీల రాజకీయ పొత్తు వ్యక్తిగత స్వార్థం కోసం కాదని రాష్ట్ర శ్రేయస్సుని కాంక్షించే జరిగిందని, ప్రతి ఒక్కరు ఈ పొత్తుకు మద్దతుగా నిలబడాలంటూ తమ పార్టీ కార్యకర్తలకు, నేతలకు , నాయకులకు పొత్తు ప్రకటన చేసిన సందర్భంలోనే వివరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తనకి, తన పార్టీకి కష్టకాలంలో మద్దతుగా నిలబడిన పవన్ ను అభినందించారు. అలాగే ఈ రెండు పార్టీల పొత్తుతో ఏపీలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునఃస్థాపిద్దాం అంటూ తమ పార్టీ నేతలకు పొత్తు ఆవశ్యకతను తెలియచేసారు. అలాగే లోకేష్ జగన్ లాంటి భస్మాసురుడిని అంతమొందించాలంటే రెండు పార్టీల పొత్తు తప్పనిసరని తమ క్యాడర్ కు దిశా నిర్దేశం చేసారు.

అలాగే బాలకృష్ణ అయితే ఒక అడుగుముందుకు వేసి జనసేన జెండా మెడలో వేసుకుని “జై తెలుగుదేశం, జై జనసేన”..అంటూ రెండు పార్టీల నేతలను, కార్యకర్తలను ఉద్దేజపరిచిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా రా కదిలిరా..కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించిన తరుణంలో తన పై కూడా పార్టీ శ్రేణుల నుండి ఒత్తిడి ఉన్నందున నేను కూడా రిపబ్లిక్ డే సందర్భంగా రాజోలు, రాజానగరం సీట్లలో జనసేన పోటీ చేయబోతుంది అంటూ పవన్ కళ్యాణ్ కూడా రెండు సీట్లను ప్రకటించారు.

దీనితో పవన్ చేసిన సహాయాన్ని కూడా మరిచి పొత్తు ధర్మానికి ముందుగా తూట్లు పొడిచింది టీడీపీ అంటూ జనసేన క్యాడర్, మీ పార్టీ కి అంత సీన్ లేదంటూ, కనీసం పవన్ కూడా గెలిపించుకోలేకపోయిన మీరా మాకు చెప్పేది అంటూ టీడీపీ శ్రేణులు ఇద్దరు ఒకరకంగా వైసీపీ గెలుపు కోసం కుస్తీలు పట్టేందుకు సిద్ధమయ్యారు. చిన్న చిన్న మాట తేడాలు ఉన్నప్పటికీ వైసీపీ పార్టీని గద్దె దింపడమే ఇరు పార్టీల ఉమ్మడి లక్ష్యం అనేది ఇరు పార్టీల నేతల నుంచి కార్యకర్తల వరకు గుర్తుంచుకో గలిగితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలు తలెత్తేవి కాదని ఇరు పార్టీల గెలుపుని కాంక్షించే వారి అభిప్రాయం.

విషయానికి వస్తే., రాజమండ్రి కాతేరులో టీడీపీ నిర్వహిస్తున్న రా కదలిరా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు సొంత పార్టీ నేతల నుండే ప్రమాదం తప్పింది. రాజానగరం టికెట్ ను జనసేన ప్రకటించడంతో అక్కడి టీడీపీ టికెట్ ఆశించిన బొడ్డు వెంకటరమణ వర్గీయులు ఆందోళనకు దిగారు. కార్యక్రమం ముగించుకుని కిందకు వస్తున్న చంద్రబాబు ని బొడ్డు వర్గీయులు అడ్డుకోవడంతో వారిని నిలువరించడానికి మరికొంతమంది అక్కడికి చేరుకోవడంతో తోపులాట జరిగి బాబు స్టేజి మీద నుంచి కిందకు పడబోయారు.

అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది బాబుని పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. పొత్తులో ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న త్యాగాలు కూడా చేయకుండా అధినేత పై తిరుగుబాటుకు యత్నించడం అంటే తన వేలుతో తన కళ్ళే పొడుచుకున్నట్టే. సీటు కోసం కుస్తీ పట్లు పడుతున్న ఈ సోకాల్డ్ నేతలంతా బాబు అరెస్టైన సందర్భంలో పార్టీని నిలబెట్టడానికి, బాబు కి మద్దతుగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎందుకు ముందుకు రాలేదో చెప్పగలరా..?

సొంత పార్టీల నేతలు ఇలా సహనం కోల్పోయి వాగ్వాదాలకు దిగడం వలన జరిగే పర్యవసానాలు ఏమిటో ఒక్కసారి కూడా ఆలోచించకుండా పార్టీల అధినేతల నిర్ణయాలకు తూట్లు పొడుస్తుంటే మరో సారి వైసీపీ అధికారంలోకి రావడం, ఇరు పార్టీలను మట్టుపెట్టడం ఖాయం అనేది గ్రహించాలి. అసలే అవకాశం కోసం గోతికాడ నక్క మాదిరి ఎదురుచూస్తున్న ప్రత్యర్థి పార్టీ నేతలకు, బ్లూ మీడియా వర్గాలకు తమ చర్యల ఫలితంగా చేచేతులా మీరే
మంచి విందు భోజనం అందించిన వారయ్యారు.

ఇదే నా పొత్తు నియమం, ఇంతేనా తమ అధినేతల నిర్ణయాలకు పార్టీ క్యాడర్ ఇచ్చే గౌరవం. ఇలాంటి చర్యల వలన రెండు పార్టీల నేతలు సాధించేది ఏంటో ఒక్కసారి ఆలోచించాలి. తమలో తమకు ఎటువంటి మనస్పర్థలు ఉన్న పార్టీ అధినాయకత్వంతో సంప్రదింపులు చేసుకుని ఆచి తూచి మాట్లాడాల్సిన విలువైన సమయంలో ఇలా అరుపులతో , అల్లర్లతో…ఎవరి గెలుపు కోసం ఈ కుస్తీలు పడుతున్నారో పునఃపరిశీలించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories