టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకున్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు సీట్ల సర్దుబాట్లపై పలుమార్లు చర్చిస్తూనే ఉన్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు అరకు, మండపేట శాసనసభ నియోజకవర్గాలకు టిడిపి అభ్యర్ధులను ప్రకటించడంతో, పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. దాంతో ఆయన కూడా రాజోలు, రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు.
పొత్తులో ఉన్నప్పుడు రెండు పార్టీలు దేనికవి అభ్యర్ధులను ప్రకటించుకోవడంతో పొత్తులు బెడిసి కొడుతున్నాయని వైసీపి సంతోషించే లోపుగా నేడు, టిడిపి, జనసేనలు 13 ఎంపీ సీట్లను సర్దుబాటు చేసుకున్నాయి. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
టిడిపికి 11 ఎంపీ సీట్లు, జనసేనకు 2 ఎంపీ సీట్లు ఖరారు చేసుకున్నాయి. మచిలీపట్నం, కాకినాడ ఎంపీ సీట్లు జనసేనకు దక్కగా, తిరుపతి, రాజంపేట, అనంతపురం, హిందూపురం, విజయవాడ, నరసారావుపేట, అమలాపురం, నర్సాపురం, ఏలూరు, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం సీట్లు టిడిపి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వీటిలో కొన్ని సీట్లకు టిడిపి అభ్యర్ధులను ఖరారు చేసుకొని, మిగిలిన సీట్లకు పలువురి పేర్లను పరిశీలిస్తోంది. జనసేన మరో 2-3 ఎంపీ సీట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 15వ తేదీలోగా రెండు పార్టీలు, శాసనసభ, లోక్‌సభ అన్ని స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసుకొని ఒకేసారి ప్రకటించాలని భావిస్తున్నాయి. అందువల్లే అభ్యర్ధుల పేర్లు ప్రకటించడంలో ఆలస్యం అవుతోంది.




