“ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని కూర్చోంటే రోజూ మనమే ఇబ్బందులు పడాల్సివస్తుంది. కనుక గుంతలు పడిన రోడ్లను మనమే పూడ్చేద్దామని” ఏలూరు జిల్లాలోని పెదవేగికి చెందిన టిడిపి నాయకులు నడుం బిగించారు.
పెదవేగి టిడిపి నాయకుడు కొనకళ్ళ శివమణి రోడ్ల మరమత్తుల కోసం రూ.30,000 విరాళం అందించగా, స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు మరికొంత చందాలు వేసుకొని దాంతో సిమెంట్, గ్రావెల్, ఇసుక కొని తీసుకువచ్చి గ్రామంలోని శుక్రవారం ఏలూరు-జంగారెడ్డిగూడెం ఆర్ అండ్ బి రోడ్డుపై గుంతలను పూడ్చివేశారు.
అనంతరం టిడిపి మండల అధ్యక్షుడు బొప్పన సుధాకర్ విలేఖరులతో మాట్లాడుతూ, “గత మూడేళ్ళుగా ఇక్కడి రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది. స్థానిక ఎమ్మెల్యేకు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రోడ్లు మరమత్తులు చేయించలేదు. మేము టిడిపివాళ్ళం కనుక మా వినతులు పట్టించుకోకపోవచ్చు. కానీ రోడ్లు గుంతలు పడితే ప్రజలందరూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కదా?వైసీపీ ప్రభుత్వాన్ని, నేతలను నమ్ముకొని ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలి? గుంతలు పడిన ఈ రోడ్లపై ప్రయాణించడానికి ప్రజలు రోజూ నానా అవస్థలు పడుతున్నారు. అందుకే మా సొంత సొమ్ముతోనే గుంతలు పూడ్చాము. ఇకనైనా స్థానిక వైసీపీ నేతలు తమ ఎమ్మెల్యేకి, ప్రభుత్వానికి చెప్పి రోడ్లు మరమత్తులు చేయించాలి,” అని అన్నారు.
ఈ రోడ్డు మరమత్తు కార్యక్రమంలో పెదవేగి గ్రామానికి చెందిన టిడిపి నాయకులు ఆలపాటి బాలకృష్ణ, తాళ్ళూరి శివాజీ, బొప్పన పండు, మాదు రవికుమార్, నెక్కలపూడి సురేశ్ బాబు, కందేపు వెంకట్రావు, ఈడ్పుగంటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.



