గత నాలుగేళ్ళుగా సాగిన టిడిపి – బిజెపిల పొత్తు ‘శుభంకార్డు’ పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆడుతోన్న డ్రామాలతో విసిగివేసారిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేనా… బయటకు ఇలా వచ్చారో లేదో అలా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమయ్యారు. అయిదుగురు ఎంపీలతో వైసీపీ ఇచ్చిన అవిశ్వాసం కంటే, 16 మంది ఎంపీలు ఉన్న మన పార్టీ అవిశ్వాసం పెడితే, అందుకు తగిన విధంగా మద్దతు మనం కూడగట్టవచ్చని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
ఓ పక్కన జగన్ తో కుమ్మక్కు… మరో పవన్ తో డ్రామాలు… బిజెపి ఆడిస్తోందని, ఇక వారితో కొనసాగడం రాష్ట్రానికి శ్రేయస్సు కాదని నిర్ణయించుకున్న చంద్రబాబు, అదే విషయాన్ని అమిత్ షాకు తెలియజేయగా, ‘మీ ఇష్టం’ అంటూ సింపుల్ గా తేల్చేసినట్లుగా తెలుస్తోంది. బిజెపి వ్యవహారం తీరు చూస్తుంటే… ఖచ్చితంగా ఏపీలో రాజకీయ కుట్రకు స్కెచ్ వేస్తోందన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళుతోంది. ఎప్పుడైతే కేంద్రానికి వ్యతిరేకంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారో, సరిగ్గా అప్పుడే వారిని నిలువరించేందుకు పవన్ ను బరిలోకి దింపిందన్న టాక్ పెచ్చుమీరుతోంది.
అవిశ్వాసం వైసీపీ పెట్టినా, టిడిపి పెట్టినా మోడీ సర్కార్ ను గద్దె దించే అవకాశమైతే లేదు గానీ, ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తుందని చెప్పవచ్చు. తొలుత వైసీపీ అవిశ్వాసానికి మద్దతు తెలపాలని టిడిపి భావించినప్పటికీ, కుట్ర పూరితమైన రాజకీయాలు చేస్తోన్న వైసీపీ అవిశ్వాసానికి మద్దతు తెలిపితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో, బిజెపి – వైసీపీల ట్రాప్ లో పడడం ఇష్టం లేక వైసీపీ అవిశ్వాసం నుండి టిడిపి తప్పుకుంది. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పే పవన్ కళ్యాణ్ వ్యవహార తీరు పట్ల కూడా చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం.



