జగన్మోహన్ రెడ్డి తమపై చాలా కసితో రగిలిపోతున్నారని టిడిపి నేతలకు తెలుసు కానీ చంద్రబాబు నాయుడునే అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారని బహుశః ఆయనతో సహా టిడిపిలో ఎవరూ ఊహించి ఉండరు. అందుకే మొదట అందరూ పెద్ద షాక్‌కు గురయ్యారు. కానీ రెండుమూడు రోజులలోనే తేరుకొని మళ్ళీ వైసీపి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచుతున్నారు.
ఈ వయసులో చంద్రబాబు నాయుడు ఇది శారీరికంగా చాలా బాధాకరమైనదే. ఈ కష్టాన్ని, అవమానాన్ని భరించడం చాలా కష్టమే. కానీ ఇదే టిడిపికి తనను తాను నిరూపించుకొనే అవకాశం కూడా కల్పించిందని అయన గ్రహించే ఉంటారు.
గతంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టిడిపి ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని నిలబడింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకుండా ఈ అగ్నిపరీక్షను కూడా ఎదుర్కొని నిలబడగలదా లేదా?అని నిరూపించుకొనే అవకాశం లభించింది.
నిలబడగలదని ఇప్పటికే నారా లోకేశ్, టిడిపి నేతలు నిరూపిస్తున్నారు. అయితే అప్పుడే ఈ పరీక్ష పూర్తవలేదు. ఇప్పుడే మొదలైందని మంత్రి రోజా వంటివారు చెపుతున్నారు కనుక వాటిని కూడా ఎదుర్కొని అధిగమించాల్సి ఉంటుంది.
ఈ క్లిష్ట సమయంలో టిడిపి రాజకీయంగా కూడా వైసీపిని ఎదుర్కొని పైచేయి సాధించవలసి ఉంటుంది. ఇప్పటికే ఏపీలో జనసేనతో దోస్తీ కుదురింది. బీజేపీని వద్దనుకొంటే వామపక్షాలు కూడా టిడిపి, జనసేనలతో కలిసి జగన్ ప్రభుత్వం మీద, వచ్చే ఎన్నికలలో వైసీపితో పోరాడేందుకు సిద్దంగానే ఉన్నాయి.
కనుక ఇప్పుడు టిడిపి రాజకీయ కార్యాచరణ చాలా కీలకం కానుంది. ఒకవేళ టిడిపి ఇప్పుడు సరైన వ్యూహాలతో జగన్ ప్రభుత్వానికి చెక్ పెట్టగలిగితే, ఎన్నికలకు ముందే టిడిపి సగం విజయం సాధించిన్నట్లే అవుతుంది. అప్పుడు ఇక టిడిపిని ఏ శక్తి ఆపలేదు.