కేవలం ఒక్క పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల పోరుకి అటు అధికార టీడీపీ ఇటు ప్రతిపక్ష వైసీపీ రెండు హోరా హోరీ యుద్ధమే చేసాయి. ముప్పయ్యేళ్ల ఏకగ్రీవాలకు చెక్ పెట్టి పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని టీడీపీ పట్టు బిగిస్తే,
మూడు దశాబ్దాల తమ నియంతృత్వాన్ని నిర్విరామంగా కొనసాగించేందుకు వైసీపీ పంతం పట్టి సార్వత్రిక ఎన్నికల మాదిరి తలపడ్డాయి. పోటీ పడుతున్నది టీడీపీ, వైసీపీ అభ్యర్థులే అయినప్పటికీ గెలుపు ఓటములు మాత్రం బాబు, జగన్ వి అన్నట్టుగా పులివెందుల పోరు నడిచింది.
వై నాట్ 175 అన్న వైసీపీ నినాదానికి వై నాట్ పులివెందుల అన్నట్టుగా బదులు చెప్పారు ఓటర్లు. అలాగే వై నాట్ కుప్పం అంటూ రెచ్చిపోయిన వైసీపీ కి వై నాట్ పులివెందుల అంటూ గట్టి సమాధానం ఇచ్చింది టీడీపీ. నాటి కుప్పం ఓటమి అవమానానికి నేటి పులివెందుల గెలుపు గర్వంతో లెక్క సరిచేశారు బాబు.
టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6716 ఓట్లు సాధించగా, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 683 ఓట్లు దక్కించుకున్నారు. అంటే సుమారు 6033 ఓట్ల భారీ తేడాతో టీడీపీ ఘన విజయం అందుకుంది. దీనితో టీడీపీ లో సంబరాలు మొదలవ్వగా వైసీపీ లో విషాదఛాయలు అలుముకున్నాయి.
టీడీపీ నేత లతా రెడ్డి గెలుపు ని అభినందించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నుండి ఆ పార్టీ నాయకులందరు పోటీపడుతుండగా బాబు సతీమణి ‘నారా భువనేశ్వరి’ సైతం లతారెడ్డి కి స్వయంగా ఫోన్ చేసి పులివెందుల విజయం పై అభినందనలు తెలిపారు.
టీడీపీ లో అభినందనల వర్షం కురుస్తుండగా వైసీపీ లో ఆక్రోశ ఉరుములు మెరుస్తున్నాయి. పులివెందుల ఎమ్మెల్యే గా వైస్ జగన్ కు ఇది ఘోర పరాభవం అనే చెప్పాలి.
ఇన్నాళ్లు తమ పార్టీ నేతల కష్టానికి తన ఓదార్పు ను అందిస్తూ పరామర్శల యాత్రలు చేస్తున్న జగన్ కు ఇప్పుడు వైసీపీ ఓటమి అవమానం నుంచి కోలుకోవడానికి చెల్లెల్లు షర్మిల, సునీతల పరామర్శ, వారి ఓదార్పు అవసరమేమో అంటూ వైసీపీ కి కౌంటర్లు పేలుతునాయి.
వైసీపీ సార్వత్రిక ఎన్నికల ఓటమి వివేకా మరణానికి నివాళిగా భావిస్తే, పులివెందుల వైసీపీ ఓటమి సునీత, షర్మిల కన్నీటి ఉసురుకి సాక్ష్యంగా నిలుస్తుంది. వైస్ అవినాష్ రెడ్డి మీద న్యాయపోరాటం చేస్తున్న సునీత కు పులివెందులలో వైసీపీ ఓటమి మానసిక ఆనందాన్ని అందించవచ్చు.
అలాగే తన సొంత అన్న వైస్ జగన్ మీద చేస్తున్న రాజకీయ యుద్దానికి పులివెందుల వైసీపీ ఓటమి షర్మిలకు నూతన ఉత్సహాన్ని ఇవ్వొచ్చు. అయితే ఇంత వరకు ఈ ఇద్దరు చెల్లెల్లు పులివెందుల వైసీపీ ఓటమి గురించి స్పందించలేదు. అదే వైసీపీ కి గొప్ప ఓదార్పు, జగన్ కు మంచి పరామర్శ గా భావించాలి.
అయితే నాటి వైసీపీ నేతల బూతులు, అసభ్యకర రాజకీయాలు వైసీపీ ని 151 నుంచి 11 కి తెస్తే నేటి రప్ప రప్ప వ్యాఖ్యలు, వైసీపీ అవినీతి పులివెందుల పరాభవానికి సంకేతాలుగా చెప్పవచ్చు.
ఇప్పటికైనా వైసీపీ అధినేత నుంచి ఆ పార్టీ కార్యకర్తల వరకు ఓటమి పై ఆరోపణలు గెలుపు పై నిందలు వేయడం మానుకుని అసలు ప్రజలు ఎటువంటి రాజకీయాన్ని కోరుకుంటున్నారు, ఎవరి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు అనేది గమనించాలి.
అలా కాకుండా వచ్చేది మేమే మీ అంతు చూస్తాం, జగన్ 2.0 ని చూపిస్తాం అంటూ రెచ్చిపోయినా, రెచ్చకొట్టినా వైసీపీ కేవలం నినాదాలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.






