ప్రస్తుతం ఆంధ్రదేశంలో వేడిగా వాడిగా జరుగుతున్న చర్చ, సామాజిక మాధ్యమాలే వేదికగా అసభ్యకరమైన పోస్టులు వేసిన వందలాదిమంది ప్రతిపక్ష కార్యకర్తలనబడే నేరస్తుల మీద పెడుతున్న కేసులు, చేస్తున్న అరెస్టులు.
దీని గురించి మాట్లాడడానికి ముందుగా, అసలు సామాజిక మాధ్యమాల అసలు ఉద్దేశ్యం ఏమిటి అన్న విషయం మీద కొంత ఉపోద్ఘాతం అవసరం. ప్రతీ వ్యక్తికీ తనదైన భావజాలం అంటూ ఒకటి ఉంటుంది. ఆ భావజాలం స్థిరపడడానికి, స్థిరపరుచుకోవడానికి ఆ వ్యక్తి జీవితకాలం కృషి చేస్తూనే ఉంటాడు. వీలైనంతవరకూ ఆ ముద్రలను మరింత గట్టివిగా చేసుకుంటూ, వాటిని సమర్థించుకునే ప్రయత్నమే చేస్తాడు కానీ నిజానిజాలను నిష్పాక్షికంగా తెలుసుకునే ప్రయత్నం నూటికో కోటికో ఒకరు మాత్రమే చేస్తారు.
అయితే ఆ క్రమంలో అందరు వ్యక్తులకూ వారి భావజాలాన్ని సమర్థించే రెండో వ్యక్తి అవసరం బాగా గట్టిగా ఉంటుంది. ఇంకొకరెవరైనా తన భావజాలాన్ని, తన అభిప్రాయాలను ఒప్పుకునేవారు, మెచ్చుకునేవారు ఉంటే బాగుండుననే ఆలోచన గట్టిగా ఉంటుంది. దానికి అసలైన కారణం అభద్రతాభావం. ఒకవేళ తన భావజాలం, అభిప్రాయాలు సరైనవి కావేమోననే అభద్రతాభావం తనను జీవితమంతా వెంటాడుతూనే ఉంటుంది. అది పోగొట్టుకోవడానికి, తానే సరైనవాణ్ణి అని తనను తాను నమ్మించుకోవడానికి, వ్యక్తి తనలాంటి భావజాలం ఉన్నవారిని వెతుక్కుంటూనే ఉంటాడు.
ఆ వెతుకులాటలో తనకు కావలసినవారు తన ఇంట్లో, తన కుటుంబంలో, తన బంధువుల్లో, తన మిత్రుల్లో, తన ఊర్లో ఎవరూ దొరకనప్పుడు, తన గోడు వెళ్ళబోసుకోవడానికి, తన భావజాలాన్ని, అభిప్రాయాలను సమర్థించుకోవడానికి ఒక వేదికను తనే సృష్టించుకున్నాడు. అవే ఈ సామాజిక మాధ్యమాలు. ఈ వేదికలు నానాజాతిసమితికి చెందినవి. జాతిమతకులవర్ణవర్గ విచక్షణ లేకుండా ఎవరితోనైనా ఎప్పుడైనా సంభాషించగల సౌకర్యాన్ని ఈ వేదికల ద్వారా మనిషి సృష్టించుకున్నాడు.
వాటి ద్వారా తన కష్టసుఖాలను, లాభ నష్టాలను వాటిలో ఇమిడి ఉన్న భావోద్వేగాలన్నింటినీ తను అందరితోనూ పంచుకుంటే, అంతమందిలో అవి నచ్చేవారెవరో ఒకరిద్దరు తారసపడకపోతారా అన్న ఆశాభావం తనను ఆ వేదికలవెంబడి పరుగులెత్తిస్తోంది. ఈ వెతుకులాటలో నిజంగానే మంచి స్నేహితులు తటస్థపడడం, వారితో బంధం పెంచుకోగలగడం కూడా చాలా సందర్భాల్లో సాధ్యమే. అదీ సామాజిక మాధ్యమాల వల్ల అసలైన ఉపయోగం.
ఆల్‌ఫ్రెడ్ నోబుల్ అనే స్వీడిష్ శాస్త్రవేత్త, డిటోనేటర్, డైనమైట్లు అనేవాటిని మానవాళి రోజువారీ జీవనానికి, అభివృద్ధికి పనికిరావాలనే ఉద్దేశ్యంతో కనిపెట్టినప్పటికీ ఒకానొక సమయానికి అవి మానవాళి వినాశనానికే ఎక్కువ దారితీసే పర్యవసానాలను చూసి అతని మీద అతనికే అసహ్యం, బాధ కలిగాయని చెబుతూంటారు. అలాగ, మనిషి కనుగొనే విషయాలన్నీ, ఆ కనుగొన్నప్పటి ఉద్దేశ్యాల కంటే కూడా వేరే పక్కదార్లు పట్టడమే చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాము.
ఈ సామాజిక మాధ్యమాలు కూడా ఆ కోవకు చెందినవే.
మనిషి వాటిని కనుక్కున్న ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, వాటిని వాడుతున్న విధానాలు, వాటి ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యాలు వేర్వేరు అయిపోయాయి. వ్యక్తుల బలహీనతలను, వారి అవసరాలను అడ్డం పెట్టుకుని, వారికి డబ్బు ఎఱ వేసి, వారి చేత వారివి కాని అభిప్రాయాలను, ఉద్దేశ్యాలను, మాటలను రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందించడం ద్వారా తమకు మంది బలం ఉందని నిరూపించుకోవాలనే మూక స్వామ్యంతో నడుస్తూ నడిపిస్తున్నవారిలో ముఖ్యమైనవి కొన్ని రాజకీయ పార్టీలూ, వాటి నాయకులే అనడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు.
ఇలా డబ్బు ఎఱ చూపించి పనులు జరిపించుకోవడానికి కూడా ఒక వయసుకు చేరుకున్నవారి విజ్ఞత ఈ రాజకీయపార్టీలకు పెద్ద అడ్డంకిగా నిలుస్తుంది. అందువల్ల వారి అసలు టార్గెట్ పిల్లలు, యువత అవుతున్నారు. ఈ వర్గానికి వారి గురించి వారు ఆలోచన చేసుకుని అర్థం చేసుకునేంత పరిణతి ఉండదు కానీ, చుట్టూ ఉన్న ధనిక ప్రపంచాన్ని చూస్తూ పెరిగే క్రమంలో వారికి రకరకాల ఆశలు పొడసూపుతూంటాయి.
ఆ ఆశలనే ఆలంబనగా చేసుకున్న ఈ కొన్ని రాజకీయ పార్టీలు వారి మెదళ్ళలో విషాన్నీ, వారి పర్సుల్లో డబ్బునూ నింపి, వారిని సమాజంపైకి విచ్చలవిడిగా అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలిపెడుతున్నారు. ఆ ఎటూ కాని వయసులో ఉన్నవారికి ఈ రకమైన మార్గంలో పయనించకూడదు అని ముఖ్యంగా చెప్పాల్సిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూండబట్టి సమాజంలో ఈ జాడ్యం మరింత ఎక్కువైంది.
వావీ వరుసా, ఉచ్ఛం నీచం, చిన్నా పెద్దా తేడా తెలియకుండా మాటలు వదిలేయడం, సాధారణ వ్యక్తులు ఎవరూ వాడలేని, కనీసం వినలేని నీచమైన బూతులతో ఎదుటివారి మీద దాడి చేయడం, తమ కోరికలను ఎవరైతే తీరుస్తున్నారో, తమ దురలవాట్లకు ఎవరైతే సహకరిస్తున్నారో, వారి లక్ష్యాలకు అనుగుణంగా విష ప్రచారాన్ని ఇబ్బడిముబ్బడిగా కొనసాగించడం సర్వసాధారణమైపోయింది.
అయితే, ఈ విషయంలో పరిణామక్రమాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే, పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంతవరకూ, 2019 కి ముందు, 2019 కి తర్వాత అని విభజించి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, అంతవరకూ చెల్లాచెదరుగా ఉన్న ఈ విషప్రచారపు వర్గాన్ని 2019లో అధికారంలోకి వచ్చినవారు బాగా గట్టిగా వ్యవస్థీకృతం చేశారు. అలా చేయడం కూడా, సలహాదారుల పేరుతో ప్రభుత్వ ఖజానా ఖర్చుతోనే చేయడం మరో పెద్ద కొసమెఱుపు.
మన దగ్గర చట్టాలు బాగా గట్టిగా చేస్తాం. నియమనిబంధనలు బహు కట్టుదిట్టంగా రాసుకుంటాం. కానీ వాటి అమలుకు వచ్చేసరికి కళ్ళు తేలేస్తాం. ఎందుకంటే, ఇలా అన్ని రకాల వ్యవస్థల్లోనూ ఇలాంటి చీడపురుగులు చేరడం వల్ల వాటి అమలు జరగకపోగా, కంచే చేను మేసిన చందంగా అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, ఉంటాయి కూడా.
ఒకానొకనాడు, ఆ చట్టాలను, ఆ నియమనిబంధనలను సవ్యంగా, ఒక పద్ధతిలో అమలు చేయాల్సిన అగత్యం కలిగినప్పుడు మాత్రం ఈ చెడుదారి పట్టిన వేలాదిమంది యువత భవితవ్యానికి ఎవరూ కాపు కాయలేరు, వారిని ఎవరైనా బింకంగా పైకి సమర్థించినా, క్షేత్రస్థాయిలో వారికి ఎవరైనా సరే చేయగలిగే సహాయం ఏమీ అంటే ఏమీ ఉండదు. ఆ విషయాన్ని అలా విషప్రచారపు మత్తులో జోగుతున్న సదరు యువత గ్రహించాలి.
కొత్తగా తయారైన భారతీయ న్యాయ సంహితలో ఉన్న నియమాల ప్రకారం ఇటువంటి విష ప్రచారాలకు, వ్యక్తిత్వ హననానికి, చాలా కఠినమైన శిక్షలు, లక్షలకొద్దీ జరిమానాలూ ఉన్నాయి. 2019-24 మధ్యకాలంలోని ప్రభుత్వం, దాన్ని నడిపించిన పార్టీ తమ అధికారాన్ని ఎంతగా దుర్వినియోగం చేసి ఈ సామాజిక మాధ్యమాల ద్వారా వేలాదిమంది యువతను మత్తు పదార్థాలకు, కల్తీ మద్యానికి, దురలవాట్లకు బానిసలను చేసి తమ లక్ష్యాలను వారిచేత సాధించుకోవడానికి వారిని ఎలా తప్పుదోవ పట్టించారో అందరమూ కళ్ళారా చూశాం. దానికి ప్రతిఫలంగా ప్రజలు ఆ పార్టీకి ప్రతిపక్షస్థానం కూడా దక్కకుండా చేసి విసిరికొట్టిన విషయం కూడా అంతకంటే గట్టిగా చూశాం.
ఇప్పుడు, వారి వలన అనేకమైన కష్టనష్టాలు పడి ప్రజల తీర్పుతో మళ్ళీ అధికారంలోకి వచ్చినది కూడా ఒక రాజకీయపార్టీనే అయినా కూడా, ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు చట్టాన్ని, న్యాయాన్ని సరైన క్రమపద్ధతిలో వాడాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు జరుగుతున్న పరిణామాలు మన కంటి ఎదురుగా ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి.
నిజంగా రాబోయే నాలుగున్నరేళ్ళూ కూడా ఇంతే గట్టిగా, నిక్కచ్చిగా పాలకపక్షం వ్యవహరిస్తే, ఎంతమంది నరరూప రాక్షసులను జైల్లో తోయాలో లెక్క రాయడానికి, లెక్కలు తీయడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నా కూడా అతిశయోక్తి కాదు. అదే జరిగితే, ఎన్ని కుటుంబాలు వీధిన పడతాయో, తమ తప్పు ఏమాత్రమూ లేకుండా ఎన్ని వ్యక్తిత్వాలు సర్వనాశనమవుతాయో ఊహకు కూడా అందకుండా ఉంది.
కాబట్టి, గతం గతం.. జరిగిందేదో జరిగింది.. ఇప్పుడు దాన్ని ఎలాగూ తిరగరాయలేం. యువత, వారి తల్లిదండ్రులు ఇప్పటికైనా మేలుకుని తాము నడుస్తున్న దారి, వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని ఇకనైనా గుర్తించి, వారి శక్తియుక్తులను సరైన విధంగా వాడుకుని, ఉద్వేగానికీ ఉన్మాదానికీ ఉన్న తేడాను గుర్తించి నడుచుకుంటే వారి భవిష్యత్తుకు వారు మేలు చేసుకున్నవారౌతారు. సమాజానికి మరెంతో మేలు చేసినవారౌతారు.