తెలంగాణలో ఏకు మేకైన బిజెపి వరుసగా లోక్‌సభ, గ్రేటర్ హైదరాబాద్, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు, సిఎం కేసీఆర్‌కు తేరుకోలేని షాకులు ఇచ్చి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ‘పని’చేస్తోంది. దీంతో అపర చాణక్యుడు అని పేరుగాంచిన సిఎం కేసీఆర్ అంతటివాడు ప్రశాంత్ కిషోర్‌ను ఆశ్రయించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
బహుశః ఆయన సలహాతోనే సిఎం కేసీఆర్ హటాత్తుగా ధాన్యం కొనుగోలు పేరుతో కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. రాష్ట్రంలో ఆందోళనలు చేశారు. సిఎం కేసీఆర్ ఢిల్లీలో 10 రోజులు మకాం వేసినప్పుడు అక్కడ ఏమి జరిగిందో తెలీదు కానీ ఢిల్లీ నుంచి తిరిగిరాగానే హటాత్తుగా యూ టర్న్ తీసుకొని తెలంగాణలో పండిన ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ప్రకటించి యుద్ధాన్ని ముగించడంతో మళ్ళీ అందరూ ఆశ్చర్యపోయారు.
టిఆర్ఎస్, బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందనడానికి ఇదే నిదర్శనం… రెండు పార్టీలు కలిసి తెలంగాణ రైతులను నిలువునా ముంచేస్తున్నాయని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ పోరాటాలతోనే సిఎం కేసీఆర్ దిగివచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వాదిస్తున్నారు. కేంద్రం మొండి చెయ్యి చూపినందునే తమ రైతులను కాపాడుకోవడం కోసం సిఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని టిఆర్ఎస్ నేతలు చెపుతున్నారు.
మూడు పార్టీల వాదనలను పక్కన పెడితే, ధాన్యం కొనుగోలు చేయకుండా ఇంకా కేంద్రాన్ని నిందిస్తూ రాజకీయాలు చేస్తుంటే టిఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం కూడా వరి రైతుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ఈ కారణంగా రైతులు కూడా చేజారిపోవచ్చు. మరోపక్క కేంద్రం ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. కనుక దీనిని ఇంకా సాగదీయడం కంటే ధాన్యం కొనుగోలు చేసి రైతులను ప్రసన్నం చేసుకోవడమే మంచిదని సిఎం కేసీఆర్ గ్రహించినట్లే ఉన్నారు.
దీంతో రైతులను బిజెపి ఆకర్షించడం మాట అటుంచి వారి ఆగ్రహాన్ని బిజెపిపైకి మళ్లించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మిల్లింగ్‌లో నూకల నష్టం భరించి కేంద్రానికి ధాన్యం సరఫరా చేస్తే ఒకవేళ అప్పుడూ కేంద్రం కొనుగోలుచేయకపోతే, అప్పుడు కేంద్రాన్ని టిఆర్ఎస్ మరింత గట్టిగా నిలదీయవచ్చు. బహుశః అందుకే సిఎం కేసీఆర్ ఈ విషయంలో యూ టర్న్ తీసుకోవడానికి వెనకాడలేదు.
దీంతో సిఎం కేసీఆర్‌కు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలుసని అర్దమవుతోంది. ఈ విషయంలో ఇప్పుడు తగ్గినా మున్ముందు ‘తగ్గేదేలే…’ అంటారని కూడా తెలుసు. కనుక ఆయనను ఏవిదంగా ఎదుర్కోవాలో బిజెపియే ఇప్పుడు ఆలోచించుకోవలసి ఉంటుంది.



