ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీలలో టికెట్ల కోసం పోటీ, ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీకి ఈసారి కూడా విజయావకాశాలు ఎక్కువగా ఉన్నందున మరింత పోటీ ఉంటుంది. కనుక అభ్యర్ధులను ఖరారు చేయడం చాలా కష్టం. అయితే కేసీఆర్ మొదటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్స్ ఇస్తూ ఆ ఒత్తిడి నుంచి తప్పించుకొంటున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలలో పనితీరు బాగోలేదనుకొన్న కొద్దిమందిని మాత్రం మార్చి మిగిలినవారితో యధాతధంగా ఎన్నికలకు వెళ్ళి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఈసారి కూడా అదే ఫార్ములాతో ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్దమవుతున్నారు.
తెలంగాణ శాసనసభకు ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలాఖరు నుంచి ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది. కనుక ప్రతిపక్షాల కంటే ముందే కేసీఆర్ బిఆర్ఎస్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.
ఈ నెల అధిక శ్రావణ మాసం శుక్రవారంతో ముగిసి శనివారం (తదియ) నుంచి పవిత్ర శ్రావణమాసం మొదలవుతుంది. తెలంగాణలో మొత్తం 117 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వాటిలో 90 స్థానాలకు అదే రోజున అభ్యర్ధుల తొలిజాబితాను కేసీఆర్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
అందుకే కేసీఆర్ మెదక్ పర్యటన, మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన వాయిదా వేసుకొన్నారని తెలుస్తోంది. ఒకవేళ ఏ కారణం చేతైనా ఆలస్యం అయితే ఆగస్ట్ 25, 26, 27 (నవమి దశమి, ఏకాదశి)లో ఏదో ఓ రోజు తొలిజాబితా విడుదల చేయడం ఖాయమని తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే సూర్యాపేట జిల్లాలో భారీ బహిరంగసభని ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావం పూరించబోతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పుకొనే కాంగ్రెస్, బిజెపిలు కూడా 40-50 మంది వరకు అభ్యర్ధులను దాదాపు ఖరారు చేసుకొని ఆ జాబితాలను తమ అధిష్టానానికి పంపిన్నట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన, అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో కూడిన బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యి 5 రాష్ట్రాల అభ్యర్ధుల జాబితాలపై చర్చించింది. వాటిలో తెలంగాణ అభ్యర్ధుల జాబితా కూడా ఉంది. కనుక ఎన్నికల గంట మ్రోగకమునుపే తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైపోవచ్చు.



