తెలంగాణలో పదేళ్ల నిరీక్షణ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోట్ల మధ్య మరెన్నో వివాదాస్పద నిర్ణయాల మధ్య తన ఏడాదిన్నర పాలనను పూర్తి చేసుకుంది. దీనితో ఈసారి ప్రభుత్వ క్యాబినెట్ విస్తరణలో తమ పేరు కూడా ఉండాలి అంటూ కొందరు, ఉంటుందని మరికొందరు బహిరంగ ప్రకటనలు జారీ చేస్తున్నారు.
ఇందులో మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు గత నాలుగు రోజుల నుంచి తమ మంత్రి పదవుల పై మీడియాలో బహిరంగ ప్రకటనలు చేస్తూ, పార్టీ సీనియర్ లీడర్ల మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఎన్నికైన ఏకైక కాంగ్రెస్ నాయకుడిని నేనే కాబట్టి నాకు ప్రభుత్వంలో మంత్రి పదవి కావాల్సిందే అంటూ మల్ రెడ్డి, అలాగే మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకుడిని నేనే, నాకు క్యాబినెట్ లో చోటు ఉండాల్సిందే, లేకుంటే మంచిర్యాలను ముంచినట్టే అంటూ ప్రేమ్ సాగర్,
ఇక వివాదాల నేత కోమటిరెడ్డి రాజగోపాల్ ఏకంగా తనకు హోమ్ మంత్రి పదవి పై ఎప్పటి నుంచో ఆశ ఉందని, ఈ సారి ఆ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నట్టు తన మనసులోని మాటను మీడియా ముందు బయట పెట్టారు. ఇక అక్కడితో ఆగకుండా తనకు మంత్రి పదవి రాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి దృతరాష్ట్రుడిలా అడ్డుపడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
ఇలా ఈ ముగ్గురు నేతలు కూడా సమయం, సందర్భం చిక్కినప్పుడల్లా మీడియా ముఖముగా మంత్రి పదవుల పై నోరుజారడంతో ఇక వీరి నోటికి తాళం వేసే బాధ్యతను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు. అందుకు గాను పార్టీలో ఎవరు కూడా మంత్రి పదవుల పై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని, అవి వారికి మేలు చేయకపోగా, కీడు ను తీసుకువస్తామని, ఎవరికీ ఏ పదవి అనేది అధిష్టాన నిర్ణయం మేరకే జరుగుతుందని తేల్చి చెప్పారు.
ఇక అప్పటి వరకు ఇలా పదవుల పంచాయితీతో కాంగ్రెస్ ప్రభుత్వ పరువు బజారున పెట్టొదంటూ సీఎం తన పార్టీ ఎమ్మెల్యే లకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ లో మొదటి నుంచి కూడా ఇదే రకమైన రాజకీయం నడుస్తూ ఉంటుంది. అదే వారిని అధికారానికి దూరం చేస్తున్నా ఆ పార్టీ నాయకులు మాత్రం ఈ తరహా అంతర్గత రాజకీయాలను బహిర్గతం చేస్తూ ప్రత్యర్థి పార్టీలకు నైతిక బలాన్ని తెచ్చిపెడతారు.
అయితే సీఎం రేవంత్ మాత్రం తన హయాంలో ఇటువంటి రాజకీయాలకు తావు ఉండకూడతూ అనే దృఢ సంకల్పంతో పార్టీలోని సీనియర్, జూనియర్లను కలుపుకుంటూపోతున్నారు. అయినా కూడా కొమతమంది నేతలు తమ బుద్ది మార్చుకోకపోవడం పై రేవంత్ సీరియస్ అయినట్లు సమాచారం. పార్టీ పదవుల మీద పెట్టిన శ్రద్ద పార్టీ బలోపేతం మీద పెట్టాలంటూ పార్టీ నాయకులకు రేవంత్ సూచనలు చేస్తున్నారు.
అలాగే పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు ఎవ్వరు కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి గాని, ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కానీ అధికార పార్టీ నాయకులు చొరవ చూపించాలంటూ పార్టీ నేతలకు హితవు పలికారు రేవంత్. మరి పార్టీలోని పదవుల ఆశావహులు ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి మౌనం వహిస్తారా లేక మరోసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజా స్వామ్యాన్ని బయటపెడతారా.?




