ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి నేటికి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా వేడుకలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న ఈ వేడుకల్లో టీఆర్ఎస్ నేతలతో పాటు ఆయా జిల్లాల అధికార యంత్రాంగం పాల్గొననుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రారంభం కానున్న వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు.
నగరంలోని అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించే కార్యక్రమంతో మొదలయ్యే వేడుకలు ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరతాయి. పోలీసు కవాతుతో పాటు పలు రంగాల్లో ప్రతిభ కనబరచిన వారికి అవార్డుల ప్రధానం, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత సంజీవయ్య పార్క్ లో ఏర్పాటు చేసిన భారీ మువ్వన్నెల జెండాను కేసీఆర్ ఆవిష్కరిస్తారు. పిదప పలు రంగాలకు చెందిన ప్రముఖులతో కేసీఆర్ భేటీ అవుతారు.
ఇదిలా ఉంటే, మరో వైపు బుధవారం నాడు కేసీఆర్ సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాతే కుట్రలు జరిగాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ చర్చలకు దారి తీసాయి. అయితే వాటన్నింటినీ ఎదుర్కోవడానికి రాజకీయ పునరేకీకరణ అవసరమైందని, పార్టీలో చేరికలు వలసలు కావని, పునరేకీకరణ మాత్రమేనని, రెండేళ్లలో రాజకీయ సుస్థిరత సాధించామని… ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశం ఎత్తుకు లేపిన నేత మర్రి చెన్నారెడ్డిని గుర్తు చేసుకున్నారు.



