పదేళ్ళ కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుంటే, జగన్ ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ‘మనకే ఎందుకు ఈ దౌర్భాగ్యం?’ అని నిట్టూర్చుతూ చూస్తుండిపోయేవారు. అయితే ఆ అభివృద్ధి మాటున భారీగా అవినీతి, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలు దాగి ఉన్నాయని తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాక్ష్యాధారాలతో సహా నిరూపించి చూపిస్తోంది ఇప్పుడు.
తెలంగాణ కాంగ్రెస్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ చూస్తే ఎవరైనా షాక్ అవకమానరు. “కేసీఆర్ పాపాన్ని మోస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. కేసీఆర్ పదేండ్ల పాలన చేసిన అప్పు తీర్చేందుకు కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి. రోజుకు రూ. 191 కోట్లు అప్పులు, వడ్డీలకే చెల్లింపు. 2023 డిసెంబర్ నుంచి 2024 జూన్ 17 వరకు అసలు, వడ్డీల కింద చెల్లించింది రూ. 38,040 కోట్లు,” అని ట్వీట్ చేసింది.
అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో కేసీఆర్‌ని ఎంతగా తప్పుపడుతున్నప్పటికీ, తెలంగాణలో జరిగిన అభివృద్ధి కళ్ళకు కనబడుతోంది. కనుక కొంత మేసినా కొంత అభివృద్ధికి ఖర్చు చేశారని స్పష్టం అవుతోంది.
కానీ గత 5 ఏళ్ళ జగన్ పాలనలో అప్పులే తప్ప అభివృద్ధి అనే మాట వినిపించనే లేదు. ఎప్పుడు చూసినా “సంక్షేమ పధకాలు-బటన్ నొక్కాను-మేలు చేస్తున్నాను…” అనే మాటలు అరిగిపోయిన రికార్డులా 5 ఏళ్ళు వినిపించాయి.
పొద్దున భోజనం పెడితే రాత్రికి కనపడనట్లే సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు ముట్టజెప్పిన సొమ్ము కూడా ఎన్నికల సమయానికి ఖర్సు అయిపోయినట్లుంది. అందుకే వైసీపికి ఓట్లు పడలేదు.
మొత్తంగా చూస్తే ఏపీలో అభివృద్ధి జరుగాలేదు కానీ అప్పులు, వాటికి చెల్లించాల్సిన వడ్డీలు మాత్రం మిగిలి ఉన్నాయని స్పష్టం అవుతోంది.
తెలంగాణలో ఇంతగా అభివృద్ధి జరిగితే రోజుకి రూ.191 కోట్లు చొప్పున అప్పులు, వడ్డీలకు పోతోందని తెలంగాణ కాంగ్రెస్ మొత్తుకుంటోంది. ఈ లెక్కన జగన్ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేయకుండానే చేసిన అప్పులు, వడ్డీలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రోజుకి ఎంత చెల్లించవలసి ఉంటుంది?అని ఆలోచిస్తే సామాన్య ప్రజలకు కూడా భయం కలుగుతుంది. ఎందుకంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ భారం మోయాల్సింది సామాన్య ప్రజలే కనుక!
మళ్ళీ కేసీఆర్ వద్దకి వస్తే… జగన్ ఆయనకు శిష్యుడు వంటివారే. కనుక అభివృద్ధి చేయకుండా అప్పులు చేయడం మంచి పద్దతి కాదని వారించి సన్మార్గంలో నడిపించవచ్చు. అభివృద్ధి విషయంలో అవసరమైన సలహాలు సూచనలు చేయవచ్చు.
కానీ పొరుగింటికి నిప్పు అంటుకునే కదా నా చుట్టకి నిప్పు దొరుకుంటుదన్నట్లు, ఏపీ తగులబడితేనే కదా తన గొప్పతనం తెలుస్తుందని కేసీఆర్ అనుకున్నారో ఏమో… జగన్ మూడు రాజధానులంటూ కాలక్షేపం చేసేస్తున్నా, ఎడాపెడా లక్షల కోట్లు అప్పులు తెచ్చి సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచిపెట్టేస్తున్నా… ఏనాడూ పిలిచి మాట్లాడలేదు. వారించలేదు.
అయినా ప్రధాని నరేంద్రమోడీయే ఎన్నడూ వారించకుండా అడిగినంతా అప్పులు ఇచ్చి పంపిస్తుంటే జగన్ తాను చేస్తున్నది తప్పని ఎందుకు అనుకుంటారు?
కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై జగన్ అనే అణుబాంబు పడటంతో అన్ని రంగాలు నాశనం అయిపోయాయి. ఐదేళ్ళ జగన్ పాలనలో రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు నష్టం కలిగిందో లెక్క కట్టడం ఎవరి వల్లా కాకపోవచ్చు. కానీ ఎన్ని లక్షల కోట్లు అప్పులు, వడ్డీలు చెల్లించాలో త్వరలోనే ప్రజాకూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలతో ఎలాగూ బయటపెడుతుంది. కనుక ఆ బాంబు మోతని అందరూ భరించక తప్పదు.
కేసీఆర్ పాపాన్ని మోస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.
కేసీఆర్ పదేండ్ల పాలన చేసిన అప్పు తీర్చేందుకు కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి.
రోజుకు రూ. 191 కోట్లు అప్పులు, వడ్డీలకే చెల్లింపు.
2023 డిసెంబర్ నుంచి 2024 జూన్ 17 వరకు అసలు, వడ్డీల కింద చెల్లించింది రూ. 38,040 కోట్లు. pic.twitter.com/c23JTkY9dt— Telangana Congress (@INCTelangana) June 19, 2024




