తెలంగాణాను “రెండింతలు” చేయనున్న కేసీఆర్!

kcr-telangana-districtsరాష్ట్ర విభజనతో 10 జిల్లాల రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణాను ముఖ్యమంత్రి రెండింతలు చేసే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది భౌగోళికంగానో లేక అభివృద్ధిలోనో కాదు. ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను 20 జిల్లాలుగా మార్చే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రచారం జరిగినట్లుగా, కొత్త జిల్లాలు 17 కాదని, తాజాగా ఏర్పడిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో గద్వాల్, సిరిసిల్ల, జనగామలు కలిపి మొత్తం 20 జిల్లాలుగా విభజించనున్నారని సమాచారం.

ADVERTISEMENT

ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు తోడు కొత్తగా మరో 17 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ఆగస్టు 22న ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దసరా నాటికి కొత్త జిల్లాలను ప్రకటించాలని యోచిస్తున్న ప్రభుత్వం అదే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇందుకు మరికొన్ని రోజులే గడువు ఉన్న సమయంలో తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వరంగల్ జిల్లాలోని జనగామలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. ఈ మూడింటిని జిల్లాలుగా ఏర్పాటు చేయాలంటూ చాలారోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

గద్వాల జిల్లా కోసం రాజీనామా కూడా చేస్తానని మాజీ మంత్రి అరుణ ప్రకటించారు కూడా. ఇక సిరిసిల్ల నుంచి ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తుండడం, జనగామలో మెజారిటీ ప్రజలు జిల్లా కావాలని కోరుకుంటుండడంపై ఈ మూడింటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావించినట్టు సమాచారం. ఈ విషయంలో సీఎం కేసీఆర్ పలువురు ప్రజాప్రతినిధులు, మేధావుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్టు సమాచారం.

కొత్తగా 17 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు వాటికి అదనంగా మరో మూడు కలపడం వల్ల జరిగే నష్టమేమీ ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దే తుది నిర్ణయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హల్చల్ చేస్తున్నట్లుగా కార్యరూపం దాలిస్తే… మరికొద్ది రోజుల్లోనే 20 జిల్లాలతో తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories